ITR 3, 4 Deadline: అసెస్మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో 6.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు నమోదైనట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. నాన్ ఆడిట్ కేటగిరీ కింద ఐటీఆర్ 3, 4, 5,7 దాఖలు చేసేందుకు ఆగస్టు 31, 2026 ఆఖరి తేదీ అని తెలిపింది. ఆఖరి క్షణంలో రద్దీ వల్ల వచ్చే టెక్నికల్ సమస్యలని నివారించేందుకు పన్ను చెల్లింపుదారులు వెంటనే తమ రిటర్నులను సమర్పించాలని స్పష్టం చేసింది.ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం పన్ను చెల్లింపుదారుల నుంచి ఐటీఆర్ దాఖలుకు విశేష స్పందన లభిస్తోంది. 2026 ఆగస్టు 20 నాటికి మొత్తం 6.5 కోట్లకు పైగా రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది. బిజినెస్, వృత్తిపరమైన ఆదాయం కలిగిన నిపుణులు, వ్యాపారవేత్తలు దాఖలు చేసే ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 ల సంఖ్యనే 2 కోట్లకు పైగా నమోదు కావడం విశేషం.ఆగస్టు 31 గడువు ఎవరెవరికి వర్తిస్తుంది?ఖాతాల ఆడిటింగ్ అవసరం లేని వ్యక్తులు, హిందూ ఆవిభాజ్య కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు, ఇతర ట్రస్టులకు ఐటీఆర్-3, ఐటీఆర్-4, ఐటీఆర్-5, ఐటీఆర్-7 ఫారాలను సమర్పంచేందుకు ఆగస్టు 31, 2026 వరకు తుది గడువు ఉంటుంది. గడువు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఒకేసారి పోర్టల్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది.ఇ-ఫైలింగ్ పోర్టల్ నెమ్మదించడం లేదా ఓటీపీలు రాకపోవడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఆగస్టు 31వ తేదీ దాటితే సెక్షన్ 234F ప్రకారం రూ.1000 నుంచి రూ.5000 వరకు పెనాల్టీలు చెల్లించాల్సి రావచ్చు. చెల్లించాల్సిన పన్ను బాధ్యత ఉంటే సెక్షన్ 234A కింద అదనపు వడ్డీ పడుతుంది. ఆదాయపు పన్ను శాఖ సూచించినట్లుగా ఎలాంటి రుసుములు, సాంకేతిక అంతరాయాలు లేకుండా ఉండటానికి ఇన్వెస్ట్మెంట్ ఫ్రూఫ్స్లు, వార్షిక సమాచార నివేదిక, ఫారం 26ఏఎస్ లను ముందే సరిచూసుకుని ఐటీఆర్ సమర్పించడం శ్రేయస్కరం