
ఎవరెస్ట్‌పై జెండా ఎగరేయాలనుకోవడం... సరదా యాత్ర కాదు.. ప్రాణాలకు తెగించే సాహసం! పైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ అందక ఊపిరాడదు.. ఏ క్షణం ఏ కొండచరియ విరిగిపడుతుందో తెలియదు... ఈ ఆటంకాలన్నీ దాటి.. యాత్ర పూర్తి చేయాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి అంటున్నారు పల్పునూరి తులసిరెడ్డి. కఠిన పరిస్థితులకు తాళలేక తన బృందంలోని ఇద్దరు మృత్యువాతపడ్డా.. ముందుకే సాగి అత్యున్నత శిఖరాన్ని ముద్దాడారాయన. ఈ అనుభవంతో అధిరోహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. 8,848 మీటర్ల ఎత్తయిన ఉత్తుంగ శిఖరం చేరాలంటే ముందు అంతులేని సంకల్పం ప్రోది చేసుకోవాలి. ఎవరెస్టుని అధిరోహించడం కొందరి కల. తమ ఫిట్నెస్ పరీక్షించుకోవడం ఇంకొందరికి ఇష్టం. ప్రపంచమంతా తమ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు మరికొందరు. ఇలా ఏదో బలమైన సంకల్పం ఉంటేనే లక్ష్యంపై స్పష్టత ఉంటుంది. ఎవరెస్టు అధిరోహణ, తిరిగొచ్చే దారిలో అక్కడక్కడ మృతదేహాలు కనిపిస్తుంటాయి. ముందుకు సాగలేక ఆగిపోయి వెనుదిరిగే వారుంటారు. ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతుంటారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ముందుకు కదలనివ్వవు. అయినా మానసిక స్థైర్యం కోల్పోవద్దు. పరిస్థితులు అనుకూలించేదాకా వేచి చూసి ముందడుగు వేయాలి. ఎవరెస్టు చేరాక అక్కడ నిలబడేది కొద్ది నిమిషాలే. కానీ దానికోసం నెలలకొద్దీ కఠిన శిక్షణ అవసరం అంటారు తులసిరెడ్డి. రెండు రోజులు ఏమీ తినకపోయినా.. ప్రయాణం ఆగకుండా ఉండేలా శరీరాన్ని తయారు చేసుకున్నారు. భారీ మంచు చరియల్లో లోతైన బొరియలు, పాతాళంలాంటి లోయలు ఉంటాయి. ఎత్తు పెరిగేకొద్దీ పరిస్థితులు కఠినమవుతాయి. 8,000 మీటర్ల ఎత్తులో ‘డెత్ జోన్’గా పిలిచే ప్రాంతంలో ఆక్సిజన్ పలచబడుతుంది. ఊపిరితిత్తులు, మెదడు మొద్దుబారిపోతాయి. మంచు తుపానులు, అకస్మాత్తుగా మారిపోయే పరిస్థితులు, శరీరాన్ని గడ్డ కట్టించే చలి.. పొంచి ఉంటాయి. వీటన్నింటినీ ముందే అంచనా వేసుకోవాలి. ప్రతిక్షణం ఏమరుపాటుగా ఉండాలి. హై-ఆల్టిట్యూడ్ డౌన్ సూట్, గ్లౌజులు, యూవీ కళ్లద్దాలు, క్లైంబింగ్ బూట్లు, ఆక్సిజన్ మాస్కులు, సిలిండర్, వంట సామగ్రి, ఎనర్జీ బార్లు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లు