
Sale of donated body parts| ఇంటర్నెట్డెస్క్: వైద్యపరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సరిగా భద్రపర్చలేదని ప్రముఖ విద్యాసంస్థ హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. శరీర భాగాలను శవాగారం (Morgue) మాజీ మేనేజర్ బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించుకునేందుకు హార్వర్డ్ రూ.507 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. వైద్య పరిశోధనల కోసం హార్వర్డ్ మెడికల్ స్కూల్కు మృతదేహాలను ఇస్తుంటారు. వాటిని ఉంచే శవాగారాన్ని (Morgue) సెడ్రిక్ లాడ్జ్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. మూడు దశాబ్దాలుగా అతడు ఆ విధుల్లో ఉన్నాడు. దానంగా వచ్చిన మృతదేహాల నుంచి అవయవాలను వేరుచేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించేవాడు. తలలు, చర్మం, చేతులు, ఇతర భాగాలను చోరీ చేసి.. తన ఇంటికి తరలించి, భార్య సహాయంతో అమ్ముకునేవాడని దర్యాప్తులో వెల్లడైంది. 2018 నుంచి అతడు ఈ దారుణాలకు పాల్పడుతున్నాడని తేలింది. 2023లో అతడు అరెస్టు కాగా.. గతేడాది డిసెంబర్లో 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాంతో తమ ఆత్మీయుల మృతదేహాలను సరిగ్గా నిర్వహించలేదని హార్వర్డ్ (Harvard University) పై పలు కుటుంబాలు దావాలు వేశాయి. ఈ న్యాయపరమైన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను బోస్టన్లోని న్యాయస్థానం ఆమోదించింది. దావాల పరిష్కారం కోసం బాధిత కుటుంబాలకు రూ.507 కోట్లు చెల్లించేందుకు హార్వర్డ్ అంగీకరించింది. సెటిల్మెంట్ ప్రక్రియలో భాగంగా.. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చింది, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అమలు చేస్తామని పేర్కొంది. దాతల జ్ఞాపకార్థం ప్రత్యేక స్కాలర్షిప్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు