
చిన్నారుల్లో వయసుకు తగ్గ అభివృద్ధి మందగింపు 18 లక్షల మంది పిల్లలకు నవచేతన స్క్రీనింగ్‌ వీరిలో తీవ్రమైన లోపమున్న వారు 87,448 మంది వారికి చిన్నపిల్లల వైద్యుల సమక్షంలో నిరంతర పర్యవేక్షణ ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో వయసుకు తగ్గ అభివృద్ధిలో తీవ్రమైన లోపం ఉన్న వారు 87,448 (4.83%) మంది ఉన్నట్లు బయటపడింది. మధ్యస్థ స్థాయి లోపమున్న వారు 36,603 మంది (2.02%) ఉన్నట్లు తేలింది. మొత్తం 55 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో 0-6 ఏళ్ల వయసున్న పిల్లలు 23,25,298 మంది ఉండగా, గురువారం నాటికి 18,09,224 మందికి ‘నవచేతన’ సంస్థ ఆధ్వర్యంలో స్క్రీనింగ్‌ పూర్తయింది. ఈ నెల 25 నాటికి ఇది పూర్తి చేయాలని మహిళాశిశు సంక్షేమశాఖ అధికారులకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. తీవ్రమైన లోపం ఉన్న పిల్లల్లో మూడు రకాలైన సమస్యల్ని అధికారులు గుర్తించారు. ఇందులో రోగాల బారిన పడిన వారు, అభివృద్ధిపరమైన ఎదుగుదల సక్రమంగా లేనివారు, విటమిన్లు, ఖనిజాలు, పోషకాహారలోపం తీవ్రంగా ఉన్నవారిగా విభజించారు. ఈ చిన్నారులను చిన్నపిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఆ పిల్లలుంటున్న ప్రాంతాల్లో చిన్న పిల్లల వైద్యులున్న ఆసుపత్రులకు వారిని రెఫర్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన ఎదుగుదల లోపమున్న పిల్లలు ఎక్కువగా కర్నూలు జిల్లాలో ఉన్నట్లు స్క్రీనింగ్‌లో బయటపడింది. ఇక్కడ 8,247 మంది ఈ తరహా చిన్నారులున్నారు. నంద్యాల (6,924 మంది), నెల్లూరు (6,316 మంది), శ్రీకాకుళం (6,258 మంది) జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా జిల్లాల్లో 2 వేల నుంచి 6 వేల మధ్యలో ఈ తరహా చిన్నారుల సంఖ్య ఉంది. చిన్నారుల వయసుకు తగ్గ అభివృద్ధిలో తొలి ఆరేళ్లు కీలకం. స్థూల చలన నైపుణ్యాలు, సూక్ష్మ చలన నైపుణ్యాలు, భాష-భావ వ్యక్తీకరణ, సంజ్ఞానాత్మక వికాసం, సామాజిక-భావోద్వేగ వికాసం ఇలాంటివన్నీ క్రమానుగతంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి వయసుకు తగ్గట్లు జరగకపోయినా ఆ పిల్లల్లో మానసిక ఎదుగుదల, కొందరిలో శారీరక ఎదుగుదల సక్రమంగా జరగదు. ఐక్యూ స్థాయిపైనా ప్రభావం ఉంటుంది. దీన్ని గుర్తించి చిన్నారుల ఆరోగ్యభద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అంగన్‌వాడీ కేంద్రాల స్థాయిలో ఈ తరహా స్క్రీనింగ్‌ నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత యాప్‌ను తీసుకొచ్చింది. పిల్లల్లోని సామర్థ్యాలు, నైపుణ్యాలు అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, సీడీసీ, ఎయిమ్స్, తదితర ప్రముఖ సంస్థలు రూపొందించిన ప్రశ్నావళిని యాప్‌లో పొందుపరిచారు. వయసుల వారీగా ఒక్కో చిన్నారికి 25 నుంచి 30 ప్రశ్నల్ని రూపొందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





