© 2026 nimisham.in
Bonus Issue: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి రిస్క్‌కు లోబడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు చిన్న కారణాలతో పడిపోయే స్టాక్స్ ఉంటాయి. ఇదే సమయంలో భారీగా పెరిగే స్టాక్స్ కూడా ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో కేవలం స్టాక్ పెరుగుదలతోనే కాదు కంపెనీ ఆఫర్ చేసే ఇతర కారణాలతో కూడా లాభాలు అందుకోవచ్చు. ఇక్కడ బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్, డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్ ఇలా చాలానే ఉంటాయి. ఇటీవల ఇలానే ఒక కంపెనీ బోనస్ ఇష్యూ ఆఫర్ చేయగా, దానికి తాజాగా రికార్డ్ డేట్ ప్రకటించింది. అదే గుడ్‌లక్ ఇండియా లిమిటెడ్ స్టాక్.ఈ కంపెనీ కొద్ది రోజుల కిందట 2:1 రేషియోలో బోనస్ షేర్లను ఆఫర్ చేయగా ఆగస్ట్ 17న దీనికి సంబంధించి రికార్డు డేట్‌ను ప్రకటించింది. 2026, ఆగస్ట్ 21 ని రికార్డు తేదీగా బోనస్ కమిటీ ఖరారు చేసింది. అయితే ఇక్కడ సెబీ T+1 నిబంధనల ప్రకారం ఒక రోజు ముందే షేర్లు డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. కాబట్టి ముందురోజే షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ బోనస్ ఇష్యూకు అర్హత సాధిస్తారు. అంటే 2:1 రేషియోలో బోనస్ షేర్లు పొందేందుకు ఆగస్ట్ 20 అంటే మరో 2 రోజులు మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట.ఇక్కడ 2:1 రేషియోలో బోనస్ ఇష్యూ అంటే ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఈక్విటీ షేరుకు అదనంగా మరో 2 షేర్లు వస్తాయి. అంటే ఒక్క షేరు కాస్తా 3 షేర్లుగా మారతాయి. 100 షేర్లు కలిగి ఉన్న వారికి 300 షేర్లు వస్తాయి. ఇక్కడ అదనపు షేర్ల కోసం ఇన్వెస్టర్లు అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్ల షేర్ల సంఖ్య పెరుగుతుంది కానీ పెట్టుబడి విలువ ఏం మారదు. వారి షేర్ల సంఖ్య పెరిగిన దానికి అనుగుణంగా షేర్ ధర అడ్జస్ట్ అవుతుంది. షేర్ ధర తగ్గి కనిష్ఠ స్థాయిల్లో
మళ్లీ కొనుగోళ్లు పుంజుకుంటాయని చాలా వరకు కంపెనీలు ఈ బోనస్ ఇష్యూ ఆఫర్ చేస్తుంటాయి.Read Also: చేతిలో చిల్లిగవ్వ లేదు.. కేఫ్‌లో వెయిటర్‌గా మొదలుపెట్టి ఇప్పుడు వందల కోట్ల సామ్రాజ్యం!ఇటీవల క్యూ1 ఫలితాల్లో సంస్థ రాణించింది. కార్యకలాపాల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 31 శాతం పెరిగి రూ. 1287.44 కోట్లుగా నమోదైంది. ఎబిటా 46 శాతం పెరిగి రూ. 139.66 కోట్లుగా వచ్చింది. ప్రస్తుతం గుడ్‌లక్ ఇండియా షేర్ ధర ఆగస్ట్ 18న రూ. 1324 వద్ద ఉంది. మార్కెట్లు పడిపోతున్నా ఈ స్టాక్ దాదాపు 1 శాతం పెరిగింది. మార్కెట్ విలువ రూ. 4.40 వేల కోట్లుగా ఉంది. ఇక స్టాక్ మార్కెట్లను పరిశీలిస్తే సెన్సెక్స్ 320 పాయింట్లు తగ్గగా, నిఫ్టీ 70 పాయింట్లు పడిపోయింది.