© 2026 nimisham.in
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు తీపి కబురు. ఇక నుంచి ట్రైన్లలో సాఫీగా ప్రయాణం చేయవచ్చు. కొమురవెల్లిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ఈ నెల 26న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం జరిగిన రోజు నుంచే ఈ స్టేషన్లో రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి కొమురవెల్లి మీదుగా సిద్దిపేటకు ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు రైళ్లు నడుస్తాయి. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మరో రెండు రైళ్లు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచేందుకు, స్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖలోని మూడు విభాగాల అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణికుల అవసరాలపై దృష్టి సారించనుంది.ప్రస్తుతం ఈ మార్గంలో సికింద్రాబాద్ - సిద్దిపేట ప్యాసింజర్/డెమో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. భవిష్యత్తులో ఈ లైన్‌ను కరీంనగర్, కాజీపేట మార్గాలకు అనుసంధానించడం ద్వారా మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపే అవకాశం ఉంది. ఈ నూతన రైల్వే లైన్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, సిద్దిపేట, జనగామ, కరీంనగర్ జిల్లాల భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. రాజధాని నగరం సికింద్రాబాద్ నుంచి నేరుగా కనెక్టివిటీ ఉండటం వల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కూడా ప్రయాణం ఎంతో సులువు కానుంది. ముఖ్యంగా వీకెండ్స్, శ్రావణ మాసం, జాతరల సమయంలో ఈ జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేని సురక్షితమైన ప్రయాణ సదుపాయం లభిస్తుంది.ఇప్పటివరకు కొమురవెల్లి క్షేత్రానికి వెళ్లే భక్తులు కేవలం రోడ్డు మార్గంపైనే ఆధారపడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు లేదా సొంత వాహనాలు ద్వారా ప్రయాణించేవారు. పండుగలు, బ్రహ్మోత్సవాల సమయంలో రోడ్డు మార్గాల్లో తీవ్రమైన
ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, భక్తులు గంటల తరబడి ఇబ్బందులు పడేవారు. అలాగే ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదిగా ఉండేది. ఇప్పుడు ఈ నూతన రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల, భక్తులకు తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా, సురక్షితంగా, ట్రాఫిక్ కష్టాలు లేకుండా నేరుగా మల్లన్న చెంతకు చేరుకునే భాగ్యం కలగనుంది.