© 2026 nimisham.in
Gold Price: మన దేశంలో బంగారం కొనుగోళ్లు ఏడాది పొడవునా సాగుతాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో భారత్ విదేశీ మారక నిల్వలను భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ఇలా సుంకాలు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు చూసుకుంటే బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి లోహాలపై విధించిన కస్టమ్స్ డ్యూటీ రూపంలో రూ.10,463 కోట్ల మేర ఆదాయం వచ్చిందని పార్లమెంటుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంతిర పంకజ్ చౌదరి ఓ ప్రశ్నకు సమాధానంగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జల సంధి మూసివేయడం వంటి కారణాలతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆహారం, ఎరువుల ధరలకూ రెక్కలొచ్చాయి. దీంతో విదేశీ మారకం నిల్వలు కాపాడేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంది. అందులో బంగారం, వెండి వంటి వాటిపై కస్టమ్స్ సుంకాల పెంపు ఒకటి. ఆయా లోహాలపై దిగుమతి సుంకాలు పెంచడం ద్వారా కొనుగోళ్లు తగ్గించాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఇందులో భాగంగో బంగారం, వెండిపై 6 శాతంగా ఉన్నకస్టమ్స్ సుంకాన్ని మే 13వ తేదీన 15 శాతానికి పెంచింది. ఇక ప్లాటినంపై ఉన్న 6.4 శాతం సుంకాలను 15.4 శాతానికి చేర్చారు.ఇలా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు పెంచడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్య చూసుకుంటే బంగారంపై సుంకాల రూపంలో రూ.10,040 కోట్లు వసూలైంది. ఇక వెండిపై రూ.328 కోట్ల మేర ఆదాయం రాగా, ప్లాటినమ్ పై రూ.95 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. ఈ 3 లోహాలపై కలిపి మొత్తంగా రూ.10,463 కోట్ల ఆదాయం వచ్చినట్లు
కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే, పెరిగిన సుంకాల మూలంగా అదనంగా ఎంత వచ్చిందనే విషయాలను వెల్లడించలేదు.ఇక మే 13వ తేదీ నుంచి జూన్ 30 తేదీల మధ్య అక్రమ మార్గంలో తీసుకొస్తున్న బంగారం 161 కిలోలు పట్టుబడినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. బంగారం, వెండి స్మగ్లింగ్ చేస్తున్న 116 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దేశంలోకి బంగారం, వెండి దిగుమతులను నియంత్రించడం,దేశీయంగా కరెంట్ ఖాతా లోటును సమతుల్యం చేసేందుకు సుంకాలు పెంచినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరింది.ఈరోజు రేట్లు ఇవేహైదరాబాద్ మార్కెట్లో ఆగస్టు 10వ తేదీన బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.380 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,51,970 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు రూ.350 మేర తగ్గి రూ.1,39,300 వద్దకు తగ్గింది.