© 2026 nimisham.in

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GO 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల పరిరక్షణ కోసం జీవో నెం.25ను సవరించాలని, దీనిని ప్రధాన డిమాండ్‌గా స్వీకరించి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. విద్యావ్యవస్థకు ప్రాథమిక పాఠశాలలు పట్టుకొమ్మలైతే, ఉపాధ్యాయ సంఘాలకు ఎస్జీటీ (SGT)లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు (PSHMలు) వెన్నెముక వంటివారని పేర్కొంటున్నారు. తెలంగాణ విద్యాశాఖ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటు (రేషనలైజేషన్) బదిలీల ప్రక్రియ క్రమబద్ధీకరణ కోసం జీవో నెం.25ను తీసుకువచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను పునర్విభజించడం, బడ్జెట్ వినియోగాన్ని క్రమబద్ధీకరించి కొరత ఉన్న చోట నియామకాలు పూర్తి చేయడమే ఈ జీవో ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ జీవోలో నిర్ణయించిన నిబంధనలు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితికి దూరంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 1:30 ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయుల పోస్టులను ఖరారు చేయడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల ఒకటి కంటే ఎక్కువ తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన (ఏకోపాధ్యాయ) పరిస్థితులు ఏర్పడి, ప్రాథమిక విద్య నాణ్యత దెబ్బతింటోందని ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్నాయి. జులై 31, 2026 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,03,550 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, వారిలో సుమారు 48 వేల మంది ఎస్జీటీలు, 4 వేల మంది పీఎస్‌హెచ్‌ఎంలు ప్రాథమిక పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య పరిరక్షణపై ఉపాధ్యాయ సంఘాలు మరింత బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 1:30 ఉపాధ్యాయ-విద్యార్థుల
నిష్పత్తి నిబంధనను సవరించాలని ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండేలా చూడాలని, అలాగే తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం వంటి సబ్జెక్టులకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు.
జీవో నెం.25 అమలులో భాగంగా జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు వల్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ప్రాథమిక విద్య నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, చిన్నారులు ప్రాథమిక స్థాయిలో సాధించాల్సిన కనీస లెర్నింగ్ లెవల్స్ (Minimum Learning Levels) సైతం కోల్పోతున్నారని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ "పిల్లల కోసం నాతో పోరాడండి" అని ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పేద, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక పాఠశాలల పరిరక్షణను ఉపాధ్యాయ సంఘాలన్నీ ఉమ్మడి ఎజెండాగా స్వీకరించాలని కోరుతున్నారు. ప్రాథమిక విద్యను కాపాడుకోవడానికి ఇదే సరైన సమయమని, జీవో నెం.25 సవరణే ప్రధాన డిమాండ్‌గా ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.