
ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ప్రాధాన్యమివ్వాలి: షర్మిల ఈనాడు, అమరావతి: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రస్థాయి కమిటీని ప్రకటించారు. రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లు జేడీ శీలం, మస్తాన్ వలీ నేతృత్వంలో కమిటీ ఉంటుందని ఆమె వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులతో షర్మిల సోమవారం జూమ్ సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి పెద్దపీట వేయాలి. బలవంతపు ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ చేసే ప్రయత్నాలు అడ్డుకోవాలి. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం ఇప్పుడు కాంగ్రెస్సే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అండగా నిలవాలి. పెండింగ్లోని జిల్లా కమిటీలు, ఇన్ఛార్జుల నియామకాలు రెండు రోజుల్లో పూర్తిచేస్తాం’ అని షర్మిల వివరించారు. ‘మూడు దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు మొదటిదశ పనులు పూర్తికావడం శుభసూచకమే. దీనిద్వారా తీవ్ర కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఇకనైనా సాగు, తాగునీరు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిద్దాం’ అని షర్మిల సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘వెలిగొండ ప్రాజెక్టులో 82% పనులు పూర్తిచేసింది వైఎస్సార్ హయాంలోనే. తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తిచేశానని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పే ముందు అత్మ పరిశీలన చేసుకోవాలి’ అని షర్మిల అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు