ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా అస్వస్థతకు గురయ్యారు. దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన నడ్డాకు కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి కార్డియాలజీ విభాగం తెలిపింది.
బాలఘాట్: మధ్యప్రదేశ్‌లోని బాలఘాట్ జిల్లాలో గిరిజన ప్రాబల్య గ్రామాల్లో కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురై 19 మంది చిన్నారులు మృతి చెందారు. కుండెకసా, బండారి, కోర్కా గ్రామాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని మధ్యప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేత(కాంగ్రెస్) ఉమంగ్ సింఘర్ వ్యాఖ్యానించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులను, వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. గత కొంతకాలంగా కలుషిత జలాల కారణంగా అనారోగ్యాలు ప్రబలాయని, దీంతో ఇప్పటి వరకూ 19 మంది చిన్నారులు మరణించారని పలువురు గ్రామస్థులు కూడా తెలిపారు.
9 నెలల తర్వాత భూమికి బాహుబలి రాకెట్ శకలం
దిల్లీ: గత ఏడాది ఉపగ్రహ ప్రయోగం తర్వాత రోదసిలో మిగిలిపోయిన భారత ఎల్వీఎం3-ఎం5 రాకెట్‌కు సంబంధించిన ఎగువ దశ.. 9 నెలల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది. దీంతో సరైన ప్రణాళిక ఉంటే రోదసిలో శకలాలను తగ్గించొచ్చని స్పష్టమైంది. ఎల్వీఎం3 రాకెట్ శకలం భూవాతావరణంలోకి సురక్షితంగా తిరిగొచ్చినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. గాలి రాపిడికి ఆ భాగం చాలావరకూ కాలిపోయి ఉంటుందని, మిగిలిన భాగాలు అట్లాంటిక్ మహాసముద్రంపై పడి ఉండొచ్చని తెలిపింది.
నాందేడ్ ఆసుపత్రి నుంచి బాదల్ డిశ్ఛార్జి
నాందేడ్: పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ శుక్రవారం మధ్యాహ్నం నాందేడ్‌లోని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. అనంతరం విమానంలో పంజాబ్ బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఉన్న గురుద్వారాకు వచ్చిన బాదల్‌పై గురువారం జస్పాల్ సింగ్ అనే వ్యక్తి కిర్పాల్‌తో దాడి చేశారు. కుడిచేతికి గాయంకావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. బాదల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రాణాపాయంలేదని తెలిపారు. దేశంలో, పంజాబ్‌లో అశాంతిని సృష్టించాలని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని, వాటి కుయుక్తులను శిరోమణి అకాలీ దళ్ కొనసాగనివ్వబోదని సుఖ్బీర్ పేర్కొన్నారు.
కుల గణనపై తీవ్రమైన అనుమానాలున్నాయ్: కాంగ్రెస్
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న కుల గణన ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బిహార్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన కుల సర్వేల తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా సిద్ధం చేసిన రాష్ట్రాల వారీ కులాల జాబితాతో వివరాలు సేకరిస్తుందని అందరూ భావించారని ఆయన పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న వారి సమాధానాల ఆధారంగా ఆయా కులాలను ఎంచుకునే సరికొత్త విధానం ఉండాలని ఆశించామని తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తూ ప్రభుత్వం అలాంటి స్పష్టమైన జాబితాను రూపొందించకుండా.. కేవలం సమాధానాలను నమోదు చేసుకోవడం వల్ల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోందని విమర్శించారు. కుల గణనను పక్కాగా, శాస్త్రీయంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
దిల్లీ: యాంటీ పేపర్ లీకు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌పై సభాహక్కుల ఉల్లంఘనకు సంబంధించి రెండు ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిని భాజపా ఎంపీలు అనురాగ్ ఠాకుర్, సంజయ్ జయస్వాల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆ ఫిర్యాదుల్లో చేసిన ఆరోపణలపై ఈ నెల 28 లోగా సమాధానం ఇవ్వాలంటూ లోక్‌సభ సచివాలయం రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.
మణిపుర్‌లోని కుకీ, మైతేయి వర్గాలకు సుప్రీం హితవు
దిల్లీ: జాతుల మధ్య ఘర్షణలతో మూడేళ్లకు పైగా కుదేలైన మణిపుర్‌లోని కుకీ, మైతేయి వర్గాలకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. ‘ఘర్షణలతో అలసిపోయి ఉంటారు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇకనైనా శాంతి పునరుద్ధరణ గురించి ఆలోచించండి. రహదారులపై రాకపోకలకు వీలుకల్పించండి. నిత్యావసరాల రవాణాకు రహదారులు ఎంతో కీలకం’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం హితవు పలికింది. రవాణా మార్గాలు, రహదారులను దిగ్బంధించడం ఎవరికీ ఉపయోగకరం కాదని పేర్కొంది. ‘రహదారులను తెరవడానికి ఇరువర్గాలు ప్రయత్నించేలా మేం చూస్తాం’ అంటూ ఈ వ్యాజ్యంలో కేంద్రం, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను భాగస్వాములుగా చేసింది. పరస్పర ఆరోపణలు విరమించుకుని సమస్య పరిష్కారానికి తగిన ప్రతిపాదనలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించింది. జాతీయ రహదారి-2పై అవరోధాల తొలగింపునకు ఆదేశించాలంటూ కుకీ మహిళా గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ కొనసాగింది. ధర్మాసనంలో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన సభ్యులుగా ఉన్నారు.
సైబర్ నేరాల కేసుల్లో అనుమానిత నగదు వరకే బ్యాంకు ఖాతాల్లో నిలిపివేయాలి
లఖ్‌నవూ: సైబర్ నేరాల కేసుల్లో దర్యాప్తు సంస్థలకు అలహాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. అనుమానిత వ్యక్తుల బ్యాంకు ఖాతాలు అన్నింటినీ సంపూర్ణంగా నిలిపివేయడం తగదని, ఏ మేరకు నగదు అక్రమంగా జమ అయ్యిందని భావిస్తున్నారో అంత మొత్తాన్ని మాత్రమే లావాదేవీలకు వీల్లేకుండా చేయాలని జస్టిస్ బి.సరాఫ్, జస్టిస్ అబ్దేశ్ కుమార్ చౌధరీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ఆర్థిక లావాదేవీలు, చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాలు అన్నింటినీ దర్యాప్తు ముగిసే వరకూ స్తంభింపజేసే అధికారం తమకు ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించరాదని తెలిపింది. ఒక వ్యాపారి ఖాతాలో రూ.36వేలు అక్రమంగా జమైన కేసులో అతని బ్యాంకు ఖాతాలు అన్నింటినీ జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిష్కరిస్తూ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
దాంపత్య గొడవల్లో భార్యను గొడ్రాలని పిలవడాన్ని గృహహింసగా పరిగణించలేం
లఖ్‌నవూ: సంతానం కలగని విషయమై దంపతులు గొడవపడుతున్న సమయంలో గొడ్రాలంటూ భార్యను భర్త నిందించడాన్ని గృహహింస (ఐపీసీ సెక్షన్ 498ఎ) నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ ధర్మాసనం పేర్కొంది. తనపై దాఖలైన గృహ హింస, వరకట్నం వేధింపుల కేసులను కొట్టివేయాలన్న భర్త హీరేంద్ర కుష్వాహా పిటిషన్‌ను అనుమతిస్తూ జస్టిస్ ఇంద్రజిత్ శుక్ల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ‘పిల్లలు పుట్టలేదని నిందించడం, వైద్య పరీక్షలకు నిరాకరించడం, కుటుంబ గొడవల సమయంలో దుర్భాషలాడటం’ వంటి వాటిని ఇతరత్రా బలమైన కారణాలు లేకుండా గృహహింస పరిధిలోకి తీసుకురాలేమని జడ్జి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.