
సదస్సు విజయవంతం కావడంతో నవోత్సాహం 7 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్నవేళ కీలక పరిణామం దిల్లీ: దేశ రాజధాని దిల్లీ వేదికగా శని, ఆదివారాల్లో నిర్వహించిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడం భాజపాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సదస్సు ఫలితాలు తమ ప్రచారానికి ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ భావిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు అనుసరిస్తున్న విదేశాంగ విధానం గురించి ప్రజలకు గొప్పగా వివరించేందుకు ఇది మంచి అవకాశాన్ని కల్పించిందని అభిప్రాయపడుతోంది. నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా ఈ ఏడాది జులైలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అప్పటి నుంచి పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విపక్షాలు విమర్శల తీవ్రతను పెంచాయి. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపైనా ప్రశ్నల వర్షం కురిపించాయి. ఈ పరిస్థితుల్లో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా పలువురు అగ్ర నేతలు హాజరు కావడం.. దిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం లభించడం.. అందులో పహల్గాం ఉగ్ర దాడిని ముక్తకంఠంతో ఖండించడం వంటి పరిణామాలు.. అంతర్జాతీయ నేతగా మోదీ స్థానాన్ని మరింత బలోపేతం చేసినట్లేనని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రిక్స్‌ సదస్సు విజయవంతం కావడాన్ని గొప్ప దౌత్య విజయంగా చెబుతున్నాయి. మోదీ సర్కారు విదేశాంగ విధానంపై ప్రతిపక్ష పార్టీల విమర్శలకు సదస్సు ఫలితాలతో దీటైన జవాబిచ్చినట్లయిందని అంటున్నాయి. ప్రభుత్వాధినేతగా మోదీ పాతికేళ్లు పూర్తి చేసుకుంటుండటాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 17 నుంచి నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్‌’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని భాజపా నిర్వహించనుంది. బ్రిక్స్‌ సదస్సు విజయవంతం కావడాన్ని ఇందులో తాము విస్తృతంగా ప్రస్తావించనున్నట్లు కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మణిపుర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పంజాబ్, హిమాచల్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో కమల దళమే అధికారంలో ఉంది. ఈ 7 రాష్ట్రాల్లోనూ తమ శ్రేణులు ఉత్సాహంగా ప్రచార కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు బ్రిక్స్‌ సదస్సు ఉపయోగపడుతుందని భాజపా భావిస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





