
ఎల్‌నినో నుంచి పంటలను రక్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఈనాడు, హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పంటల సాగు లక్ష్యం తగ్గగా.. ప్రస్తుతమున్న పంటలను పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికోసం అన్నిశాఖలతో కలిపి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. దీని రూపకల్పన బాధ్యతలను వ్యవసాయశాఖకు అప్పగించింది. రాష్ట్రంలో మొత్తం 1,32,38,446 ఎకరాల్లో పంట సాగు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 1,23,08,853 ఎకరాల్లో పంటలు వేశారు. ప్రధాన పంట వరి 65,95,645 ఎకరాలకు 54,25,998 ఎకరాల్లో సాగైంది. ఇంకా 48,23,754 ఎకరాల్లో పత్తి, 34888 ఎకరాల్లో జొన్న, 592852 ఎకరాల్లో మొక్కజొన్న, 556828 ఎకరాల్లో కందులు, 160182 ఎకరాల్లో పెసర, 68878 ఎకరాల్లో మినుములు, 15754 ఎకరాల్లో వేరుసెనగ, 372400 ఎకరాల్లో సోయాబీన్, 40987 ఎకరాల్లో చెరకు తదితర పంటలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 20 జిల్లాల్లో వర్షాభావం ఉంది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, జలాశయాలు, చెరువులు, కుంటల్లో నీరు లేదు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయి. వీటిని కాపాడుకోవడం సవాలుగా మారింది. రాష్ట్రంలో పంటల వాస్తవ పరిస్థితులపై వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల, విద్యుత్, భూగర్భ జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో, విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లు, శాస్త్రవేత్తలతో త్వరలో ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పంటల అవసరాలను గుర్తిస్తారు. నీటివనరుల కల్పన, విద్యుత్‌ సరఫరా, ఎరువుల పంపిణీ, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేస్తారు. పంటల రక్షణకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటన్నింటిపై వ్యవసాయశాఖ ప్రణాళికను సిద్ధం చేసి మంగళవారం నాటికి సమర్పించాలని సర్కారు నిర్దేశించింది. ఎల్‌నినో పరిస్థితులపై పంటల స్థితిగతులు, ప్రభుత్వ కార్యాచరణను బుధవారం శాసనసభలో ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





