Aug 13 2026 1:55 PM | Updated on Aug 13 2026 1:56 PM
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్‌లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్‌జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్‌గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది.
కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..
గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.
ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.
ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.
జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు! ఉత్తరప్రదేశ్‌లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.
జెన్ ఆల్ఫా అంటే ఎవరు? జెన్‌జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు. ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది.
కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)
'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల ఇంటర్వ్యూ స్పెషల్ (ఫొటోలు)
బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
జగన్ కు ఎస్కార్ట్ గా బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి
బుడ్జోడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
ఒక MLAని అరెస్ట్ చేయాలంటే... కనీసం ప్రోటోకాల్ లేదా..
MLA విరుపాక్షి అరెస్ట్ పై YSRCP నేతల రియాక్షన్