
Rajahmundry: దేశంలో విస్తరిస్తున్న పేగు గాయాలు డాక్టర్ గోపి ఆందోళన! Rajahmundry: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబిడి) తీవ్రతపై ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణులు గోపి శ్రీకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఆచార్యుడిగా సేవలందించి, జీర్ణకోశ, కాలేయ రుగ్మతలు, అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చికిత్సల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ స్పెషలిస్ట్ గోపి శ్రీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా సేవలు అందిస్తున్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాత్రికేయ సమావేశంలో పదేపదే వచ్చే విరేచనాలు లేదా మలంలో రక్తం పడటాన్ని చాలామంది సాధారణ పైల్స్ లేదా ఇన్ఫెక్షన్ గా భావించి ఉపేక్షిస్తున్నారని, దీనివల్ల పేగులలో శాశ్వత గాయాలు ఏర్పడి పరిస్థితి విషమిస్తోందని వివరించారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నిర్వహించిన జాతీయ అధ్యయనం ప్రకారం మనదేశంలో లక్ష జనాభాకు సగటున 2.34 రేటుతో దాదాపు 31,800 కొత్త ఐబిడి కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 1990తో పోలిస్తే ప్రస్తుతం బాధితుల సంఖ్య రెట్టింపై దాదాపు 2.7 లక్షలకు చేరింది. అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ అనే ప్రధాన రకాలతో కూడిన ఈ వ్యాధి చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు అందరినీ కబలిస్తోంది. జన్యుపరమైన మూలాలు, రోగనిరోధక వ్యవస్థలోని లోపాలు, ప్రేగులలోని బ్యాక్టీరియా ప్రతిస్పందనల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. కారమైన పదార్థాలు, తీవ్ర ఒత్తిడి వల్ల లక్షణాలు ఎక్కువ కావచ్చు తప్ప అవి నేరుగా వ్యాధికి కారణం కావు. ధూమపానం వల్ల క్రోన్స్ డిసీజ్ కాంప్లికేషన్లు మరింత తీవ్రమవుతాయి.వారం రోజులకు మించి విరేచనాలు కావడం, రాత్రిపూట విరేచనాల కావడం, మలంలో జిగురు లేదా రక్తం పడటం, విపరీతమైన కడుపునొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, రక్తహీనత, నిరంతర అలసట, పిల్లల్లో ఎదుగుదల లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి