
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) కన్నుమూశారు. తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయనను గురువారం ఉదయం హుటాహుటిన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సజ్జన్ (Sajjan Kumar) మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరణానికి గల కారణాలను వైద్యులు ఇంకా నిర్ధరించలేదు. అనారోగ్యంతో కన్నుమూసినట్లు ప్రాథమిక సమాచారం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దిల్లీలో 1984 నవంబరు 1న సిక్కు వ్యతిరేక అల్లర్లు (1984 anti-Sikh riots) చోటుచేసుకున్నాయి. నానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. ఈ అల్లర్లలో 2,700 మందికి పైగా మరణించారు. ఇందుకు సంబంధించి సజ్జన్ కుమార్‌పై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు కేసుల్లో సజ్జన్ దోషిగా తేలగా.. మరో కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఐదుగురు సిక్కులను చంపి, గురుద్వారాకు నిప్పు పెట్టిన కేసులో 2018లో దిల్లీ హైకోర్టు ఆయనకు జీవితఖైదు విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. ఇక, సర్దార్ జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ను చంపిన కేసులోనూ 2025 పిబ్రవరిలో దిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన సజ్జన్.. అవుటర్ దిల్లీ స్థానం నుంచి మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జీవితఖైదు పడిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర