
Canada Flight Cancelled Seatbelt : చిన్న పిల్లల మారాం తల్లిదండ్రులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి వారు చేసే పనుల వల్ల ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ చిన్నారి చేసిన మారాం వల్ల.. ఓ విమాన సర్వీసే రద్దు కావాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఘటన కెనడాలో వెలుగులోకి వచ్చింది. విమానంలో ఉన్న ఒక చిన్నారి సీట్‌బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించి గొడవ చేయడంతో.. అధికారులు ఏకంగా ఆ విమాన సర్వీసునే రద్దు చేశారు. దీనివల్ల విమానంలోని ప్రయాణికులందరూ రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.సీటుబెల్టు పెట్టుకోనంటూ రన్‌వేపై చిన్నారి అల్లరి..!అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ సంఘటన గురువారం రాత్రి విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పోర్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం విక్టోరియా ఎయిర్పోర్ట్ నుంచి టొరంటోకు బయలుదేరడానికి సిద్ధమైంది. విమానం రన్‌వేపైకి వచ్చి టేకాఫ్ కాబోతున్న తరుణంలో.. క్యాబిన్ సిబ్బంది ఒక విచిత్రమైన పరిస్థితిని గమనించారు. విమానంలో ఉన్న ఒక చిన్నారి సీట్‌బెల్ట్ ధరించకుండా తన సీటుపైనే నిలబడి ఉంది. ఈ క్రమంలో పాప తల్లితో పాటు క్యాబిన్ సిబ్బంది కూడా ఆ చిన్నారికి సీట్‌బెల్ట్ వేయడానికి కొన్ని నిమిషాల పాటు ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ చిన్నారి ఎంతకీ వినకుండా ఏడుస్తూ.. తీవ్రంగా మారాం చేసింది.క్యాబిన్ సిబ్బంది ఎంత నచ్చజెప్పినా పాప వినకపోవడం, సీట్‌బెల్ట్ లేకుండా విమానాన్ని టేకాఫ్ చేయడం అత్యంత ప్రమాదకరమని భావించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం సీట్‌బెల్ట్ ధరించని ప్రయాణికుడితో టేకాఫ్ సాధ్యం కాకపోవడంతో.. విమానాన్ని తిరిగి టర్మినల్‌కు మళ్లించారు. సీట్‌బెల్ట్ ధరించడానికి నిరాకరించిన చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి కిందకు దించేశారు. ఈ వ్యవహారం పూర్తయి.. నిబంధనలకు అనుగుణంగా ఫ్లైట్ ప్లాన్లను తిరిగి రీ-ఫైల్ చేసేసరికి అర్ధరాత్రి 12.30 గంటలు దాటిపోయింది.రన్ వే మూసివేత.. రద్దయిన ఫ్లైట్తీరా ప్రక్రియ అంతా ముగిసే సమయానికి రాత్రి 12.30 కావడంతో.. ఎయిర్పోర్ట్ నిబంధనల ప్రకారం రన్‌వేను మూసివేశారు. దీంతో ఆ రాత్రికి విమానం టేకాఫ్ అయ్యే అవకాశం లేకపోవడంతో వేరే దారి లేక ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఆ సర్వీసును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా విమానంలోని మిగిలిన ప్రయాణికులందరూ రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరుసటి రోజు ఉదయం అదే విమానంలో ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానమైన టొరంటోకు చేర్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై స్పందించిన పోర్టర్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరింది.





