భద్రత, సార్వభౌమాధికారం , జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశీ నిధులు ఉపయోగించకుండా పారదర్శకతను నిర్ధారించడానికి ఇది పనిచేస్తుంది. దేశీ నిధులు పొందాలనుకునే ఏ సంస్థ లేదా ఎన్జీవో అయినా కేంద్ర ప్రభుత్వంలో FCRA రిజిస్ట్రేషన్ లేదా ముందస్తు అనుమతి తీసుకోవాలి. విదేశీ విరాళాలను కేవలం ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే స్వీకరించాలి. పరిపాలనా ఖర్చుల కోసం విదేశీ నిధులలో నిర్దిష్ట శాతం మాత్రమే ఉపయోగించాలనే నిబంధనలు ఉన్నాయి.
భారత దేశంలో స్వచ్ఛంద సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సామాజిక సేవ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నాయి. దేశీయంగా పొందే విరాళాలలతో పాటు విదేశాలనుంచి విరాళాలు వెల్లువెత్తున్నాయి. సేకరించిన విరాళాలు, ఖర్చు చేస్తున్న లెక్కలను సమర్పించడంలో స్వచ్ఛంద సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో అనుమానం వ్యక్తంచేసిన కొందరు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తక్షణమే స్పందించిన అధికార యంత్రాంగం స్వచ్ఛంద సంస్థల నిర్వాకంపై నిఘాపెట్టింది. విదేశాల నుంచి వచ్చే నిధులతో సామాజిక సేవ పేరుతో మతమార్పిడులు, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయనే అనుమానంతో విదేశీ నిధులు స్వచ్ఛంద సంస్థలకు అందకుండా నిలుపుదల చేసిందని సమాచారం.
విదేశీ సహకార బిల్లు చర్చ సమయంలో విపక్షాల విమర్శలు.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ద్వారా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రత్యేకంగా చర్చించి విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని సంకల్పించింది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి జాతీయ భద్రతకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. స్వచ్ఛంద సంస్థలు రిజిస్ట్రేషన్ సమయంలో ఏర్పరచుకున్న భౌగోళిక పరిధిలో సేవలు చేయకుండా, సేవల విస్తృతి ముసుగులో పారదర్శకత లోపిస్తోందని ఆరోపణలున్నాయి. స్వచ్ఛంద సంస్థల పనితీరు జాతీయ భద్రతకు విఘాతం కలుగుతోందని విమర్శలున్నాయి. స్వచ్ఛంద సంస్థలు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నియమ నిబంధనలు పాటించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. దీంతో గడువు ముగిసినా పునరుద్ధరించుకోకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వేలాది స్వచ్ఛంద సంస్థల FCRA రెజిస్ట్రేషన్లను కేంద్రం రద్దు చేసింది.
స్వచ్ఛంద సంస్థల పనితీరులో జావాబదారి తనం.. స్వచ్ఛంద సంస్థల పనితీరులో జవాబుదారి తనం పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం, జాతీయ భద్రతను కాపాడటం, పారదర్శకతను పెంచడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. స్వచ్ఛంద సంస్థలకు విదేశీ నిధుల నిలుపుదల, నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ద్వారా కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది.
స్వచ్ఛంద సంస్థలు సామాజిక, ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, మతపరమైన విభాగాల వారీగా ప్రత్యేక కార్యాచరణ జాబితాలను, నిబంధనలను పాటించాలని ఆదేశించింది. స్వచ్ఛంద సేవాసంస్థల్లో విదేశీ విరాళాలు పొందే ప్రతీ సంస్థ దిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దిష్ట శాఖలో మాత్రమే ప్రత్యేక ఖాతా తెరవాలని తప్పనిసరి చేసింది. లైసెన్స్ రద్దయిన, రద్దు చేసుకున్న సంస్థల వద్ద ఉన్న విదేశీ నిధులను, ఆ నిధులతో కూడిన ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేలా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. మతాలను, వర్గాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించ లేదని అధికార యంత్రాంగం తెలిపింది. FCRA కింద విదేశీ విరాళాలు స్వీకరించే అన్ని అర్హతలు గల క్రైస్తవ చర్చిలు, హిందూ సంస్థలు, మసీదులు, గురుద్వారాలు, బౌద్ధ, జైన, అలాగే ఇతర NGOలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
క్రైస్తవ చర్చిలపై విదేశాల నుంచి విరాళాలు స్వీకరించే చర్చిలు, మిషనరీ సంస్థలు FCRA నిబంధనలను కచ్చితంగా పాటించాలి. రిజిస్ట్రేషన్ రద్దు లేదా గడువు ముగిస్తే, విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులు, మిగిలిన నిధులు కొత్త విధానంలో ప్రభుత్వం నియమించిన అధికారి పర్యవేక్షణలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ తిరిగి లభిస్తే, చట్టం ప్రకారం వాటిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. హిందూ దేవాలయాలు, ట్రస్టులపై విదేశీ విరాళాలు తీసుకునే దేవాలయాలు లేదా ట్రస్టులు కూడా ఇదే నిబంధనలకు లోబడి ఉంటాయి. FCRA రిజిస్ట్రేషన్ చెల్లుబాటులో ఉన్నంత వరకు సాధారణ కార్యకలాపాలపై ఈ బిల్లు ప్రత్యక్ష ప్రభావం ఉండదు. మసీదులు , ఇస్లామిక్ ట్రస్టులపై విదేశీ నిధులు స్వీకరించే మసీదులు లేదా వక్ఫ్‌కు సంబంధించిన సంస్థలకూ ఇదే నియమాలు వర్తిస్తాయి. రిజిస్ట్రేషన్ సమస్యలు వస్తే, ఇతర సంస్థల మాదిరిగానే కొత్త ఆస్తుల నిర్వహణ విధానం అమల్లోకి వస్తుంది. చట్టం ప్రకారం ఈ బిల్లు ఏ ఒక్క మతానికీ ప్రత్యేకంగా వర్తించదు. విదేశీ విరాళాలు స్వీకరించే అన్ని అర్హత సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయి. విదేశీ నిధులు కోరుకునే ఎన్జీఓలు సామాజిక, ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, మతపరమైన అనే ఐదు అనుమతించబడిన వర్గాలలో ఒకదాని కింద నమోదు చేసుకోవాలి. ప్రతి వర్గంలోని ఎన్జీఓలకు వేర్వేరు కార్యకలాపాల జాబితాలను తొలిసారిగా రూపొందించారు. ఎన్జీఓలు ఇప్పుడు తమ కార్యకలాపాలు, తమ కార్యక్రమాల భౌగోళిక పరిధి, తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, ప్రచురణలను తప్పనిసరిగా వెల్లడించాలి. అంతే కాకుండా, గతంలో FCRA రిజిస్ట్రెంట్లకు ఒకే రుసుము ఉండేదానికి భిన్నంగా, వారు పనిచేసే ప్రతి వర్గానికి, రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతానికి వేర్వేరు రుసుములను చెల్లించాలి. ఎన్జీవోలు తమ వర్గం, భౌగోళిక ప్రాంతాలలో నిర్దేశించిన కార్యకలాపాలకే పరిమితం కావాలి. సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్లు, ప్రచురణలను బహిర్గతం చేయాలి. జూన్ 22న జారీ చేసిన విదేశీ విరాళాల నియంత్రణ నిబంధనల Foreign Contribution Regulation Rules తాజా సవరణ ప్రకారం, విదేశీ నిధులను పొందాలనుకునే ప్రభుత్వేతర సంస్థలు ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యకలాపాల జాబితాకు కట్టుబడి ఉండాలని నిబంధనలు రూపొందించారు.
గత పదేళ్ల కాలంలో 20 వేల ఎన్జీవోల రిజిస్ట్రేషన్లు రద్దు.. దేశంలో విదేశీ నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థల అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రతిపాదించిన 'ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు 2026' పెను సంచలనం సృష్టిస్తోంది. గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 20వేల ఎన్జీవోల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. మరో 15,000 సంస్థల అనుమతులు గడువు ముగిసి నిలిచిపోయాయి. దీనివల్ల వేలాది కోట్ల రూపాయల విలువైన విదేశీ నిధులు, వాటితో కొనుగోలు చేసిన ఆస్తులు అనిశ్చితిలో ఉండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని స్వాధీనం చేసుకోలేక, నిర్వహించలేక చేతులెత్తేయడంతో కేంద్రం నేరుగా రంగంలోకి దిగింది.
లోక్‌సభలో ఇటీవల ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. మొత్తం 31 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఏర్పాటు చేయగా.. ఇందులో 21 మంది లోక్‌సభ, పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారని సమాచారం. ఈ కమిటీ బిల్లును సమగ్రంగా పరిశీలించి, 2026 శీతాకాల సమావేశాల తొలి వారం చివరి రోజు నాటికి తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతు హాజరైతే కోరమ్ పూర్తైనట్టుగా పరిగణిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వం బిల్లును సమీక్ష కోసం కమిటీకి పంపాలని నిర్ణయించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రతిపాదిత సవరణలను పౌర సమాజ సంస్థలు, మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగించే అవకాశం ఉందని ప్రతిపక్షం గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ విరాళాలు సమాజ శ్రేయస్సుకోసం సమర్థవంతంగా వినియోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తోందని కేంద్ర మంత్రి రిజిజు సభకు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.