
ఇంటర్నెట్ డెస్క్: చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉంటూ.. కోర్టులనే మోసం చేస్తున్న 105 మంది నకిలీ న్యాయవాదుల దందాను అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో యూపీ బార్ కౌన్సిల్ బట్టబయలు చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) దేశవ్యాప్తంగా లాయర్ల విద్యార్హతల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టడంతో ఇది వెలుగుచూసింది. ఈ తనిఖీల్లో కేటుగాళ్లు ఎల్ఎల్బీ పట్టాలనే కాకుండా, పదో తరగతి, డిగ్రీ మార్క్షీట్లను కూడా ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఇందులో అలహాబాద్ విశ్వవిద్యాలయం (Allahabad University) పేరుతో సృష్టించిన నకిలీ డిగ్రీలు కూడా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లాకు చెందిన అమర్‌సింగ్ అనే వ్యక్తి ఏకంగా 35 ఏళ్లుగా నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదిగా చలామణి అవుతున్నట్లు తెలిసింది. ఈ నకిలీల వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తర్‌ప్రదేశ్ బార్ కౌన్సిల్ అందించిన 105 మంది నిందితుల జాబితా ఆధారంగా ప్రయాగ్‌రాజ్ (Prayagraj) పోలీసులు మూడు రోజుల్లోనే 39 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మిగతా 66 మందిపై త్వరలోనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు