
మళ్లీ సంజు శాంసన్‌ చోటుకు ఎసరు వచ్చేలా ఉంది. అఫ్గాన్‌తో తొలి టీ20లో విఫలం కావడమే అందుక్కారణం. ఏంటీ ఒక్క మ్యాచ్‌కే పక్కన పెడతారా? అనే అనుమానం రాకమానదు. కానీ, అక్కడ ప్లేస్‌ కోసం తీవ్ర పోటీ ఉంది మరి.. ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌ (IND vs AFG)లో బెంచ్‌కే పరిమితం చేసి.. సంజు శాంసన్‌ను తుది జట్టులో ఆడించింది భారత మేనేజ్‌మెంట్. సంజునేమో 10 పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశ పరిచాడు. అఫ్గాన్‌పై మొదటి మ్యాచ్‌లో అలవోకగా గెలిచినప్పటికీ.. సంజు శాంసన్‌పై ఒత్తిడి పెరిగింది. రెండో టీ20లో ఆడించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. కుర్రాడికి అవకాశాలు ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. ఓపెనర్‌గా అభిషేక్ శర్మ అఫ్గాన్‌పై ఎలాంటి ఆటతీరు ప్రదర్శించాడో అంతా చూశాం. దూకుడుగా ఆడి హాఫ్‌ సెంచరీ సాధించడంతోపాటు టీమ్ఇండియా అలవోకగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్‌ కూడా రాణించాడు. దీంతో మంగళవారం జరగనున్న రెండో టీ20 నుంచి వీరిద్దరినీ తప్పించడం కష్టమే. ఇక మిగిలింది సంజు శాంసన్‌ ( Sanju Samson ) మాత్రమే. అయితే, గంభీర్‌కు సంజుపై గురి కాస్త ఎక్కువే. దీంతో వెంటనే ఈ కేరళ ప్లేయర్‌పై వేటు పడే అవకాశాలు లేవని క్రికెట్ వర్గాల విశ్లేషణ. ఒకవేళ రెండో మ్యాచ్‌లోనూ సంజు విఫలమైతే మాత్రం మూడో టీ20లో కచ్చితంగా వైభవ్‌ ఉంటాడు. గత టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించడంతో సంజు శాంసన్‌ పేరు మారుమోగిపోయింది. అయితే, అతడి ప్లేస్‌పై గ్యారంటీ ఇంకా మాత్రం రాలేదు. దానికి కారణం వైభవ్‌ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ). గత ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఈ కుర్రాడికి మొదట్లో కలిసిరాలేదు. కానీ, జింబాబ్వేపై దూకుడుగా ఆడి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు రెండో ఓపెనర్‌ కోసం సంజు శాంసన్ - వైభవ్ మధ్యనే తీవ్రమైన పోటీ ఉంది. అఫ్గాన్‌తో సిరీస్‌లో సత్తా చాటితేనే ఆసియా కప్‌తోపాటు జపాన్‌తో ఏకైక టీ20 తుది జట్టులో ఆడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో సంజు నిరాశపరిచాడు. ఇక రెండో మ్యాచ్‌లో ఎవరు ఆడినా సరే మంచి ఇన్నింగ్స్‌ ఇవ్వాల్సిందే. అఫ్గాన్‌తో ( India Vs Afghanistan ) తొలి టీ20లో మన బౌలింగ్‌ ప్రదర్శన గురించి విశ్లేషించాలంటే కాస్త కష్టంగానే ఉంది. ఆరంభంలో టకటకా వికెట్లు పడగొట్టారు. మిడిల్‌లో పట్టు వదిలారు. ఆఖర్లో మళ్లీ కట్టడి చేశారు. బుమ్రా, అర్ష్‌దీప్‌తోపాటు స్పిన్నర్లు సత్తా చాటారు. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తెలుగు ఆల్‌రౌండర్‌ నితీశ్ కుమార్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు. రెండో మ్యాచ్‌లో అతడూ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.



