© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: మెటా (Meta) ఆధీనంలోని ఇన్స్టాగ్రామ్.. 13 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో ‘డోంట్ ఆస్క్.. డోంట్ టెల్’ (అడగొద్దు.. చెప్పొద్దు) అనే పాలసీని అనుసరించిందని ఆ సంస్థ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టరో బెజెర్ కోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. మెటాపై రెండో రోజు జరిగిన విచారణలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త టూల్స్ తయారీలో భద్రతను పట్టించుకోకుండా.. మెటా నిలకడగా లాభాలపైనే దృష్టి పెట్టిందని బెజెర్ కోర్టుకు తెలిపారు. ప్రజలు ఎంత అధిక సమయం తమ యాప్స్‌లో గడుపుతారు అనే అంశానికే ప్రాధాన్యమిచ్చిందని వివరించారు. ఇన్స్టాగ్రామ్ వాడే 13 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో ‘డోంట్ ఆస్క్.. డోంట్ టెల్’ అనే పాలసీని అమలు చేసిందన్నారు. అంటే.. ఈ వయసు పిల్లలు ఇన్‌స్టా వాడుతున్నట్లు తెలిసినా యాప్ అడగదు.. పిల్లలు కూడా చెప్పకపోతే చాలు అన్న వైఖరి. 13 ఏళ్లలోపు పిల్లలు భారీ సంఖ్యలో ఇన్‌స్టా వాడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని బెజెర్ పేర్కొన్నారు. ఫేక్ ఖాతాలను గుర్తించే శక్తిమంతమైన టూల్స్ మెటా వద్ద ఉన్నాయన్నారు. కానీ, పిల్లల వయసును గుర్తించడానికి సరైన ప్రమాణాలను మాత్రం ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. కాగా.. ఈ ఆరోపణలను మెటా తోసిపుచ్చింది. ఇక జీతాల పెంపు, ప్రమోషన్ల వేళ ఉద్యోగుల పనితీరు విశ్లేషణ కూడా యూజర్ నెంబర్ల ఆధారంగానే ఉండేదని బెజెర్ వెల్లడించారు. ఈయన ఫేస్బుక్లో 2009-2015 వరకు పనిచేశారు. సైబర్ వేధింపులపై పోరాటంలో ఆయన పేరు బాగా పాపులర్ అయింది. 2019-2021 వరకు మెటా యాప్స్ సేఫ్టీ ఇష్యూస్‌పై కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2023 నాటి అమెరికా కాంగ్రెస్ విచారణలో మెటాపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ యాప్స్ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయన్న విషయం కంపెనీ సీఈవో జుకర్‌బర్గ్‌కు తెలుసని నాడు పేర్కొన్నారు. అమెరికాలో 29 రాష్ట్రాలు ఉమ్మడిగా మెటాపై ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో దావా వేశాయి. తమ సోషల్
మీడియా యాప్‌లకు చిన్నపిల్లలు, టీనేజర్లు బానిసలు అయ్యేలా మెటా (Meta) డిజైన్ చేసిందన్నది ప్రధాన ఆరోపణ. యూజర్లు వీలైనంత అధిక సమయం యాప్‌ల్లో గడిపేలా చేయడం, వారి వ్యక్తిగత సమాచారం సేకరించడం, వాస్తవాలను దాచి పెట్టడమే దాని బిజినెస్ మోడల్ అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మేగన్ ఓనెయిల్ నిన్న ప్రారంభమైన విచారణలో ఆరోపించారు. యువతను అడిక్ట్ చేస్తే.. దీర్ఘకాలం వారు వీటిపై సమయం వెచ్చిస్తారని, అలా భారీగా లాభాలు సంపాదించే అవకాశం మెటాకు లభిస్తుందని ఆమె వాదించారు. ఈ కేసు ఓడిపోతే మెటా కనీసం రూ.19 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి రావొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.