© 2026 nimisham.in
ఒకళ్లకి ఏడేళ్ల, ఇంకొకళ్లకి ఐదేళ్లు, మరొకళ్లకు మూడేళ్లు. ముగ్గురూ చిన్నపిల్లలే.. ఊహ కూడా తెలియదు. అమ్మానాన్నల మధ్య సరాదాగా పెరిగిన వీళ్ల పసిబాల్యంలో ఒక్కసారిగా కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. ఆత్మహత్యతో కన్నతల్లి కన్నుమూసింది.. ఉన్నట్టుండి కన్నతండ్రి కూడా కనిపించకుండా పోయాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పిల్లలు ఓ పెద్దాయన కొన్ని రోజులు సంరక్షించాడు. ఆ తర్వాత బాలసదన్‌కి వెళ్లారు. ఇదంతా చూసి చలించి ఏలూరు ఎస్పీ ఓ రిస్కీ ఆపరేషన్ చేసి మొత్తానికి కథ సుఖాంతం చేశారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలానికి చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు, 7, 5, 3 సంవత్సరాల వయస్సున్న ఈ ముగ్గురు చిన్నారులను దేవుడికి వదిలేసి కన్నతల్లి రెండేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వెంకన్న ఓ తొమ్మిది నెలలు పిల్లలను సాకాడు. ఓ రోజు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. READ ALSO Gajuwaka Organic Santha: విశాఖలో సేంద్రీయ సంత.. ఆరోగ్యాన్ని పెంచే కూరగాయలకు ఆదరణపసిపిల్లలను అలా ఒంటరిగా చూడలేక ఇంటి పక్కనే ఉన్న ఓ పెద్దాయన కొద్దిరోజులు సంరక్షించాడు. ఈ దారుణ పరిస్థితులపై వార్తలు రావడంతో కలెక్టర్ వెట్రిసెల్వి స్పందించి పిల్లలను దెందులూరులోని బాలసదన్‌లో చేర్పించారు. నాలుగు నెలలుగా అక్కడే ఉంటున్నారు. గత నెలలో ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ట్రాఫిక్ క్రాస్ రోడ్డుకు చిన్నారులను బాలసదన్ నిర్వాహకులు తీసుకొచ్చారు. అది తెలుసుకున్న ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అక్కడకు వెళ్లి, చిన్నారులతో కాసేపు గడిపారు. అప్పుడు ఆ పిల్లలు తమ దీనగాథను ఎస్పీకి వివరించారు. ఆ పిల్లల కన్నీటి గాథను విన్న ఎస్పీ చలించిపోయారు. వాళ్ల నాన్నని ఎలాగైనా తీసుకొస్తానంటూ పిల్లలకు మాట ఇచ్చారు. పిల్లలకు ఇచ్చిన మాట ప్రకారం శక్తి టీమ్ ఇన్చార్జి సీఐ ఎం.సుబ్బారావుకు ఆ పని అప్పగించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తండ్రి మహారాష్ట్రలో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే శక్తి టీమ్ మహారాష్ట్రకు చేరుకుని ఆ తండ్రిని
ఏలూరు తీసుకొచ్చారు. ఎస్పీ సమక్షంలో ఆ పిల్లలను తండ్రికి అప్పగించారు. ఎందుకు ఇలా పిల్లలను విడిచి వెళ్లావని తండ్రిని ప్రశ్నించగా.. ఎవరో ఓ వ్యక్తి పని ఇప్పిస్తానని టీ తాగుతున్న తనను బైక్‌పై ఎక్కించుకుని సత్తుపల్లి తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడి నుంచి బలవంతంగా మహారాష్ట్ర తీసుకెళ్లి పనిలో పెట్టాడని, తన దగ్గర ఫోన్ కూడా లేకపోవడంతో రాలేకపోయానని తండ్రి వెంకన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. పిల్లలను తండ్రికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన సీఐ సుబ్బారావు, శక్తి బృందం పోలీసులు సుజాత, రేఖ, సంపా కుమారి, దుర్గలను ఎస్పీ అభినందించారు.