
రామవరంలో డ్రైనేజీ పనులకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు రుద్రంపూర్, సెప్టెంబర్ 02 : రామవరం జాతీయ రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణ పనులు ఇప్పుడు అధికారుల ప్రణాళికా లోపానికి అద్దం పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు చేసిన వినతుల అనంతరం ఎట్టకేలకు డ్రైనేజీ నిర్మాణానికి కార్పొరేషన్ శ్రీకారం చుట్టడం స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ, నిర్మాణ మార్గం మధ్యలో విద్యుత్ స్తంభాలు అడ్డంకిగా నిలవడం అధికారుల ముందుచూపుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజా సౌకర్యం కోసం చేపట్టిన డ్రైనేజీ పనులకు విద్యుత్ స్తంభాలే అడ్డుగా మారడంతో, ముందుగా ప్రణాళిక ఎవరు రూపొందించారు? శాఖల మధ్య సమన్వయం ఎందుకు జరగలేదు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. నాలుగు మీటర్ల లోతులో కాలువ.. ఐదు మీటర్ల స్తంభానికి మిగిలేది ఎంత? విద్యుత్ స్తంభాలను సాధారణంగా సుమారు ఐదు మీటర్ల లోతులో పాతుతారని, డ్రైనేజీ నిర్మాణం కోసం సుమారు నాలుగు మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపడితే స్తంభాల పునాదికి అత్యంత తక్కువ భూమి మాత్రమే మిగిలే అవకాశం ఉందని స్థానికులు, అనుభవజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్తంభాలకు సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా భూమిలో ఏర్పాటు చేసి పైభాగంలో విద్యుత్ లైన్లు లాగారని ఆరోపణలు వస్తున్నాయి. డ్రైనేజీ కోసం భారీగా తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో స్తంభాల స్థిరత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం 33 కేవీ విద్యుత్ లైన్ను ఏర్పాటు చేసి, భారీ ఇనుప నిర్మాణాలతో కూడిన స్తంభాలను ఏర్పాటు చేసినట్లు రామవరం పరిరక్షణ కమిటీ పేర్కొంది. డ్రైనేజీ తవ్వకాల కారణంగా సమీపంలోని విద్యుత్ స్తంభాలు బలహీనపడి, అనుకోని పరిస్థితుల్లో వంగినా లేదా నేలకు ఒరిగినా, సమీపంలోని సింగరేణి విద్యుత్ నిర్మాణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదం సంభవిస్తే కేవలం విద్యుత్ సరఫరాపైనే కాకుండా, సింగరేణి బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలపైనా