
లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం పెట్ట రవికుమార్‌, పి.సుధావెంకట్‌ కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: అక్క మనవడిని దువ్వాడ వీసెజ్‌ వద్ద దించేందుకు వెళ్తుండగా.. లారీ ఢీకొనడంతో ఉపాధ్యాయుడితో పాటు విధులకు వెళ్తున్న అక్క మనవడు కూడా సంఘటన స్థలంలోనే మృతిచెందిన ఘటన దువ్వాడ స్టేషన్‌ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సామర్లకోట మండలం తొండూరుకు చెందిన పెట్ట రవికుమార్‌ (46) అచ్యుతాపురం మండలం దత్తూరు యూపీ స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం శ్రీనగర్‌ దరి విద్యానగర్‌కాలనీలో ఉంటున్నారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన అక్క మనవడు సుధావెంకట్‌ (17) వారం రోజుల క్రితం ఉపాధి నిమిత్తం రవికుమార్‌ ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం సుధావెంకట్‌ను రవికుమార్‌ తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని దువ్వాడ వీసెజ్‌లో తను పనిచేస్తున్న కంపెనీకి తీసుకెళ్తుండగా.. కూర్మన్నపాలెంలోని విశాఖ స్టీల్‌సిటీ డిపో వద్దకు వచ్చేటప్పటకి లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ కిందపడి ఘటనా స్థలంలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీని స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రవికుమార్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య సునీత కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





