© 2026 nimisham.in

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహించే సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ను ఆదేశించారు. ఈ విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవని ట్రంప్ చెప్పారు. అంతేకాదు.. ఉత్తర కొరియాకు అవి శత్రుత్వ సంకేతాలు పంపుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా-దక్షిణ కొరియా వార్షిక ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ఇందులో దాదాపు 18 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటున్నారు. విన్యాసాలను పూర్తిగా రద్దు చేసే సమయం దాటిపోయిందని ట్రంప్ చెప్పారు. అందుకే వాటి స్థాయిని గణనీయంగా తగ్గించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ సైనిక కసరత్తుల్లో డ్రోన్ దాడులను ఎదుర్కోవడం, జీపీఎస్ సంకేతాలను అడ్డుకోవడం, సైబర్ దాడులను తిప్పికొట్టడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉత్తర కొరియా సైనిక సామర్థ్యాలు మారుతున్న నేపథ్యంలో ఈసారి కొత్త విధానాలను చేర్చారు. అయితే ఈ విన్యాసాలను యుద్ధ సన్నాహాలుగా భావిస్తున్న ఉత్తర కొరియా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దక్షిణ కొరియాపై ట్రంప్ మరో కీలక వ్యాఖ్య చేశారు. ఇరాన్ అణు నిరాయుధీకరణ ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ను కోరినట్లు చెప్పారు. అయితే అందుకు దక్షిణ కొరియా నిరాకరించిందని ట్రంప్ తెలిపారు. ఈ అంశాన్ని కూడా సైనిక విన్యాసాలపై తన నిర్ణయానికి సంబంధించిన పోస్టులో ప్రస్తావించారు
.