© 2026 nimisham.in
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా డెంగ్యూకి సకాలంలో చికిత్స చేయకుండా, దాని లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాల మీదికి వస్తుంది. డెంగ్యూ వల్ల ప్లేట్లెట్ కౌంట్ వేగంగా తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కాగలంత తీవ్రంగా ఉంటుంది. డెంగ్యూ లేదా ఇతర వ్యాధుల వల్ల ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయినప్పుడు బొప్పాయి ఆకు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని చిన్న పరిశోధనల ప్రకారం, బొప్పాయి ఆకు సారం (Papaya Leaf Extract) డెంగ్యూ రోగుల్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడానికి సహాయపడుతుందని తేలింది. అయితే దీనిపై ఉన్న ఆధారాలు పరిమితం. కాబట్టి దీనిని ఖచ్చితమైన లేదా ప్రధానమైన చికిత్సగా భావించలేము. ఇది నిజమా? అపోహనా? అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ దిలీప్ గుడె (సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) అందించారు.ఇది నిజమా? అపోహనా? ఇది పూర్తిగా అబద్ధం కాదు, అలా అని ఒక అద్భుతమైన నివారణ కూడా కాదు! బొప్పాయి ఆకు రసం కొన్ని కేసుల్లో ప్లేట్లెట్లకు సహాయక పాత్ర వహిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ దీనిని అసలైన వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడకూడదు.సాధారణంగా వ్యాధి తగ్గుతున్న కొద్దీ ప్లేట్లెట్ల సంఖ్య సహజంగానే పెరుగుతుంది. కాబట్టి ఈ పెరుగుదల బొప్పాయి ఆకు రసం వల్ల జరిగిందా లేదా శరీరం స్వయంచాలకంగా కోలుకోవడం వల్ల జరిగిందా అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం.ఇది కేవలం ఇంటి చిట్కా మాత్రమేనా? అవును. డాక్టర్ సలహా మేరకు మాత్రమే బొప్పాయి ఆకును ఒక అదనపు ఉపశమనంగా వాడాలి. డెంగ్యూ వంటి సమస్యలు ఉన్నప్పుడు సరిపడా నీరు/ద్రవ పదార్థాలు తాగడం (Hydration), ప్లేట్లెట్లను ఎప్పటికప్పుడు పరీక్షించడం, రక్తస్రావం కాకుండా చూసుకోవడం, సరైన వైద్య చికిత్స పొందడమే అత్యంత ముఖ్యమైనవి.ముఖ్య హెచ్చరిక: ఒకవేళ ప్లేట్లెట్స్ వేగంగా పడిపోతున్నా, శరీరంలో ఎక్కడైనా రక్తస్రావం కనిపిస్తున్నా, తీవ్రమైన బలహీనత, కడుపునొప్పి లేదా శ్వాస
తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఇంటి వైద్యాలపై ఆధారపడకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి.పచ్చి బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? పచ్చి బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. వికారం (Nausea), వాంతులు కడుపులో మంట, విరేచనాలు (Diarrhea) విపరీతమైన చేదు రుచి వల్ల తాగడం కష్టంగా మారడంచిన్న పిల్లలు, గర్భిణులు, కాలేయ (Liver) సమస్యలు ఉన్నవారు లేదా ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నవారు మోతాదుకు మించి దీనిని తీసుకోవడం ప్రమాదకరం.ప్లేట్లెట్లు పెరగడానికి తీసుకోవాల్సిన ఫుడ్స్ దానిమ్మ పండు: రక్తంలో హీమోగ్లోబిన్, ప్లేట్లెట్ల స్థాయి మెరుగుపడటానికి ఇది బాగా దోహదపడుతుంది. కివీ పండు, ఉసిరి (విటమిన్ C): విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరంలో ఐరన్ శోషణకు, ప్లేట్లెట్ల రక్షణకు సాయపడుతుంది. కొబ్బరి నీళ్లు, ORS ద్రవాలు: డెంగ్యూలో ప్లాస్మా లీకేజ్ జరిగి డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అత్యవసరం.డెంగ్యూ సమయంలో చేయకూడని పొరపాట్లు స్వయంగా పెయిన్ కిల్లర్స్ వాడటం: జ్వరం లేదా ఒళ్ళు నొప్పుల కోసం ఆస్ప్రిన్, ఐబూప్రోఫెన్ (Ibuprofen, Diclofenac) వంటి NSAID రకం మందులను అస్సలు వాడకూడదు. ఇవి రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. కేవలం డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడాలి. ప్లేట్లెట్ కౌంట్‌ను మాత్రమే నమ్ముకోవడం: డెంగ్యూలో ప్లేట్లెట్ల సంఖ్యతో పాటు "హెమటోక్రిట్" (Hematocrit) శాతం, బీపీ స్థిరంగా ఉన్నాయా లేదా అనేది గమనించడం చాలా ముఖ్యం. చివరగా: బొప్పాయి ఆకు కొంతవరకు సహాయపడవచ్చు, కానీ ఇది అసలైన వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని జాగ్రత్తగా ఉపయోగించాలి.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ దిలీప్ గుడె సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.