© 2026 nimisham.in

టీటీడీలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) ఎం. లోకనాథం నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. తిరుపతి, తిరుమలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏడు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకే అధికారులు తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉండగా తనిఖీలు ప్రారంభించారు. అదే సమయంలో తిరుమలలోని ఆయన కార్యాలయంలో మరో బృందం సోదాలు చేపట్టింది. ఈ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా జరుగుతున్నాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి.ఈ సోదాలను అధికారులు బహుళ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. తిరుపతిలో లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలో, యెర్పేడు మండలం చెల్లూరులో ఉన్న ఆయన సోదరి నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుమలలో లోకనాథంకు సంబంధం ఉందని భావిస్తున్న ఒక గెస్ట్ హౌస్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా తిరుపతి ఎస్టీవీ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఉన్న లోకనాథం బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు తెరిచి పరిశీలిస్తున్నారు. లోకనాథం ప్రస్తుతం శ్రీవారి ఆలయం టెంపుల్ డిప్యూటీ ఈవోగా కీలక బాధ్యతల్లో ఉండగా, గతంలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు.గత దశాబ్ద కాలంలో ఒక టీటీడీ ఉన్నతాధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి
.