© 2026 nimisham.in
మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా నేపథ్యం, కథాంశం, అలాగే కథలోని విలనిజం గురించి చెప్పిన ఆసక్తకరమైన సంగతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.* అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఇరుముడి’ జోరు.... రవన్న ఈసారి గట్టిగా కొడుతున్నాడ్రోయ్‘ఇరుముడి’ కథకు అయ్యప్ప స్వామి భక్తి, 41 రోజుల మండల దీక్ష ప్రధాన మూలస్తంభాలని శివ నిర్వాణ తెలిపారు. చిన్నప్పటి నుంచే తనకు అయ్యప్ప స్వామిపై అమితమైన భక్తి, ప్రత్యేక అనుబంధం ఉండేవని, ఆ ఆలోచనలే ఈ కథారచనకు ప్రేరణగా నిలిచాయని వెల్లడించారు. 41 రోజుల పాటు అత్యంత నిష్ఠతో పాటించే నియమాలు ఒక సాధారణ వ్యక్తి అంతరంగాన్ని, అతని ఆలోచనా ధోరణిని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని భావోద్వేగభరితంగా తెరపైకి తెచ్చినట్లు చెప్పారు. ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా సహజంగా, నేటి సమాజానికి దగ్గరగా ఉంటుందని దర్శకుడు వివరించారు. హీరోకి మద్యపానం అలవాటు ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అతను అయ్యప్ప స్వామి మాల ధరించాల్సి వస్తుంది. దీక్షా నియమాల ప్రకారం మండల కాలం పాటు పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాలి. ఈ 41 రోజులు ఆ వ్యసనం నుంచి బయటపడటానికి అతను చేసే అంతర్మథనం ఏమిటి?, ఈ క్రమంలో అతని బలం, బలహీనతలు ఏమిటి?, తన ప్రాణమైన కూతురితో అతనికి ఉన్న అనుబంధంలో వచ్చిన మార్పులేంటి? అన్న భావోద్వేగ కోణంలో సినిమా సాగుతుంది’ అని శివ నిర్వాణ తెలిపారు.సాధారణంగా ఫ్యామిలీ సినిమాల్లో నిదానంగా సాగే కథనాలు ఉంటాయి. కానీ ‘ఇరుముడి’లో ఆ 41 రోజుల
టైమ్‌లైన్ కథకు ఒక సహజమైన థ్రిల్‌ను తీసుకొచ్చిందని దర్శకుడు తెలిపారు. నిర్దిష్టమైన కాలపరిమితిలో ఏం జరగబోతోంది? కథానాయకుడు తన దీక్షను, కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో రొటీన్ ఫార్మాట్లో ఒక ప్రత్యేక విలన్ క్యారెక్టర్ ఉండదని శివ నిర్వాణ స్పష్టం చేశారు. సాధారణ మనుషుల జీవితాల్లో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులు, హీరో చేసే తప్పులు, అతను ఎదుర్కొనే ఆపదలే ఈ కథలో విలన్లుగా మారతాయని విశ్లేషించారు. హీరో ఆ పరిస్థితులను ఎలా అధిగమించాడనేదే అసలైన పోరాటమని పేర్కొన్నారు. భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలబోతగా వస్తున్న ‘ఇరుముడి’ రవితేజ కెరీర్లో ఒక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఇండస్ట్రీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.