© 2026 nimisham.in
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా.. ఊహించని విధంగా భారీ మొత్తంలో బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు (భారత కరెన్సీల్లో రూ.98 కోట్లు) ఉంటాయని అంచనా. ఈ ఘటన బెల్జియం రాజధాని బ్రెస్సెల్స్కు సమీపంలోని సింటి-గిల్లిస్-డెండర్మొండె ప్రాంతంలో వెలుగుచూసినట్టు ది గార్డియన్ పత్రిక నివేదించింది. సమ్మర్ జాబ్ చేస్తోన్న కోబే అనే 18 ఏళ్ల యువకుడు ఈ నిధిని గత మంగళవారం మొదటిసారి గుర్తించాడు.అతడు స్థానిక నెట్వర్క్ వీటీఎంతో మాట్లాడుతూ.. ‘‘మాకు ఒక్కసారిగా కింద ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది..దానిని మేము యూరో నాణేలు అనుకున్నాం.. కానీ, తవ్వుతుంటే బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి.. మేము అనుకున్న దానికంటే అక్కడ పెద్ద నిధి ఉందని తర్వాత అర్థమైంది’’ అని తెలిపాడు. తన సహచర కార్మికులతో కలిసి పనులు చేస్తున్న సమయంలో నిధి బయటపడింది.19వ శతాబ్దం చివరలో మద్యం తయారీ కేంద్రం యజమాని థియోఫిలస్ వాన్ అస్చే కోసం నిర్మించిన విల్లా కింద ఇటుకలతో కట్టిన గోడలోపల భద్రపరిచిన ఒక బ్యాగులో ఈ నిధిని దాచారు. ఈ నిధిలో బంగారు నాణేలు, బంగారు ముక్కలు, నెంబర్లు వేసిన కడ్డీలు ఉన్నాయి. ‘‘సాధారణ మంగళవారం ఉదయం ఇలాంటిది జరుగుతుందని ఎవరూ ఊహించరు’’ అని కోబ్ అన్నాడు. ఈ నిధిని కావాలనే ఎవరైనా దాచిపెట్టినట్లు కనిపిస్తోందని అతడు అభిప్రాయపడ్డాడు.నిధి బయటపడిన ప్రదేశంలో 1899లో ప్రారంభమైన బీరు తయారీ కేంద్రం 1970 వరకు నడించింది. ఇప్పటికీ భవనం ఇనుప గేట్లపై ‘VA’ అనే అక్షరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం CAW ఓస్ట్-వ్లాండరెన్ అనే సామాజిక సంస్థ దీనిని కొత్త కార్యాలయాలు, నివాసాలను ఏర్పాటు చేయడానికి పునరుద్ధరిస్తోంది. ‘‘బ్రూవర్స్హౌస్ ఒక అందమైన భవనం, కానీ దానిని పూర్తిగా కూల్చివేస్తున్నారు. చివరికి, కేవలం గోడలు మాత్రమే మిగిలి ఉంటాయి’’ అని CAW ప్రతినిధిన గీర్ట్ హిల్లార్ట్ చెప్పారు. వెంటనే ఆ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి
తీసుకుని, నిధిని బ్రస్సెల్స్లోని ఒక సురక్షిత కేంద్రానికి తరలించారు. చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్ధారించడానికి అధికారులు దాని మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు ఫ్లాండర్స్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చెందిన హన్నే ఒల్లెవియర్ మాట్లాడుతూ.. ఆ బంగారం దొంగిలించింది కాదని లేదా నేరంతో సంబంధం లేదని దర్యాప్తు అధికారులు ముందుగా ధ్రువీకరించుకోవాలని అన్నారు. అయితే, మున్ముందు ఇది సంక్లిష్టమైన వివాదానికి దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, సంక్షేమ సంస్థ, వాన్ అస్చే కుటుంబ ఈ నిధిపై హక్కులు కోరే అవకాశం ఉంది. బెల్జియన్ చట్టం ప్రకారం.. నిధిని కనుగొన్నవారు దాని అసలైన యజమానులు ముందుకు వచ్చే వరకు కనీసం ఐదేళ్లు వేచి ఉండాలి. ఇక కార్మికుల విషయానికొస్తే ఇంత పెద్ద నిధిని అప్పగించాల్సిందేనని తమకు తెలుసని కోబ్ అంగీకరించారు. ‘‘అవి కొన్ని నాణేలు మాత్రమే అయితే పరిస్థితి వేరేలా ఉండేది... కానీ బహుశా చివరికి మాకు ఏదో ఒక రకమైన బహుమతి లభిస్తుందేమో’’ అని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.