
హనుమకొండ: హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కంటి వెలుగు కార్యక్రమం కింద 2018లో కంటి శుక్లాల శస్త్రచికిత్సలు చేయించుకొని 18 మంది చూపు కోల్పోయారు. ఆ బాధితులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశాల మేరకు ఈ సిఫారసులు జారీ అయ్యాయి. అప్పట్లో ఈ ఘటనపై పలు దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా.. కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఆరోగ్యశాఖ సమర్పించిన విచారణ నివేదికలు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య రికార్డులు, బాధితులు, వారి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కమిషన్ పరిశీలించింది. ఆసుపత్రి నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నట్లు విచారణలో తేలిందని కమిషన్ పేర్కొంది. బాధితులకు ఇన్ఫెక్షన్ సోకడంతో చూపు కోల్పోయి, దీర్ఘకాలిక చికిత్సతోపాటు తీవ్ర శారీరక, మానసిక వేదనకు గురైనట్లు వెల్లడించింది. ఈ ఘటన బాధితుల జీవించే హక్కు, ఆరోగ్య హక్కు, మానవ గౌరవానికి భంగం కలిగించిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా కల్పించిన హక్కుల ఉల్లంఘనగా కమిషన్ నిర్ధారించింది. మొత్తం రూ.48 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది. 12 మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున, మృతి చెందిన ఆరుగురు బాధితుల వారసులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ సిఫారసు చేసింది. అదేవిధంగా ఘటనకు బాధ్యులైన వైద్యులు, సిబ్బంది, సంబంధిత అధికారులను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని.. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శికి కమిషన్ సూచించింది. సిఫారసుల అమలుపై చర్యల నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు