
డైయింగ్ యూనిట్లతో కలుషితమవుతున్న జలవనరులు రంగు నీటి సమస్య పరిష్కారానికి 2014కు ముందు కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు ఖర్చు చేసి సీఈటీపీ నిర్మించింది. ప్రత్యేక పైపులైను ద్వారా రంగు నీటి వ్యర్థాలను సేకరించి శుద్ధి చేసి వదిలేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. కానీ రాజకీయ కారణాలతో నిర్మించిన ఏడేళ్ల వరకు ప్రారంభించలేదు. తర్వాత 5 ఏళ్లు మాత్రమే వినియోగించారు. ప్రస్తుతం పూర్తిగా పాడై మూతపడింది. పనికిరాని మొక్కలు పెరిగి శిథిల స్థితికి చేరింది. నగరి, న్యూస్టుడే: నగరి ప్రజలు ఏళ్లుగా కుటీర పరిశ్రమలతో జీవనం సాగిస్తున్నారు. మరమగ్గాలు నేస్తూ ఉపాధి పొందుతున్నారు. కానీ నూలుకు రంగులు అద్దేందుకు కొందరు మాత్రం యంత్రాలను వినియోగిస్తున్నారు. వారు రసాయనాల రంగు నీటిని బహిరంగంగా వదిలేయడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. 30 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. రంగునీటి రసాయనాల ప్రభావం 14 గ్రామాలపై పడుతోంది. ఇక్కడ ప్రజలు కనీసం నీరు తాగలేని పరిస్థితి నెలకొంది. 1972లో చిత్తూరు పట్టణంలో కరవు వస్తే ట్యాంకర్లతో మంచి నీటిని పంపించిన ఘనత నగరి సొంతం. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో మంచినీరు దొరకడం లేదు. ఇప్పటికే నియోజకవర్గంలోని మూడు మండలాల్లో చెరువులు కలుషితం అయ్యాయి. దీంతో రైతులు పంటలకు దూరమయ్యారు. డైయింగ్ యూనిట్లను జనావాసాల నుంచి దూరంగా తరలించి, ప్రత్యేక సీఈటీపీని ఆధునిక హంగులతో నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. నగరి మండలం మాంగాడు, వీకేఆర్పురం వద్ద 250 ఎకరాల ఎంఎస్ఎంఈ భూమిలో వారికి కొంత కేటాయించాలన్నది ఆలోచన. భూములు సిద్ధంగా ఉన్నాయని, త్వరలో కేటాయింపు జరుగుతుందని చెబుతూ అధికారులు, నేతలు సమాధానాలతో కాలయాపన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం త్వరలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. నగరి పరిసర ప్రాంతాల్లో కుశస్థలి నది పారడంతో 50 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. కానీ మరమగ్గ పరిశ్రమలో నూలుకు రంగులు అద్దేందుకు వినియోగించే రసాయనాల