
గిరిధర్‌ను అరెస్ట్ చేసిన తిరుమల టూటౌన్ సీఐ శ్రీరాముడు తదితరులు తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ భక్తులను, తితిదే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసగిస్తున్న తితిదే సస్పెండైన ఉద్యోగి జలకర గిరిధర్‌ను తిరుమల టూటౌన్ పీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ శ్రీరాముడు కథనం మేరకు.. తిరుపతిలోని కోలా వీధికి చెందిన జలకర గిరిధర్ తితిదే సబార్డినేట్ ఉద్యోగి. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు. తాను తితిదేలో పేష్కార్‌నని, సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడి నుంచి ఫోన్ పేలో రెండు దఫాల్లో రూ.1,56,000 నగదు బదిలీ చేయించుకున్నాడు. ఈఏడాది మే 24న టికెట్ల కోసం భక్తులు ఎస్ఎంసీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత గిరిధర్ మొబైల్ స్విచ్ఆఫ్ చేసి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తిరుపతికి చెందిన ఓ నిరుద్యోగికి తితిదేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3,60,000 తీసుకొని మోసం చేసినట్లు తేలింది. రెండు కేసులపై నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు