ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లకు కలిపి టాటా సన్స్‌లో 51.54% వాటా ఉంది. మూడోవిడతలోనూ, అయిదేళ్ల పాటు నన్ను టాటా సన్స్ ఛైర్మన్‌గా కొనసాగించాలని ట్రస్టులు ఏకగ్రీవంగా సిఫారసు చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదన పరిశీలనకొచ్చింది. అయితే ఒక డైరెక్టర్ అందుకు మద్దతు పలకపోవడంతో, ముందుకెళ్లలేదు. ఆరు నెలలు గడిచినా, ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. బోర్డు ఏకగ్రీవ మద్దతు లేనందునే, వైదొలగాలని నేను నిర్ణయించుకున్నా. టాటా సన్స్ ఎంతో కీలక ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అందువల్ల 2027 ఫిబ్రవరి తర్వాత గ్రూప్‌నకు నేతృత్వం వహించేందుకు ఒక వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. నాయకత్వంపై ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, భాగస్వాములు, ఇతర వర్గాలకూ స్పష్టత అవసరం. ఈ సమయంలో నాయకత్వంపై అనిశ్చితి ఉండడం మంచిది కాదు. అందుకే బుధవారం ఉదయం నేను టాటా సన్స్ బోర్డుకు సమాచారమిచ్చా. 2027 ఫిబ్రవరి 20 తర్వాత పునః నియామకాన్ని కోరడం లేదని తెలిపా. వారసుడిపై వేగంగా నిర్ణయం తీసుకుని, నాయకత్వ బాధ్యతలను సులభతరంగా మారేలా చేయమని బోర్డుకు సూచించా. టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల వృత్తిపర జీవితాన్ని పూర్తి చేసుకున్నా. ఇది నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయమ’ని తెలిపారు.
ఒక డైరెక్టర్ అంటూ పేరు చెప్పకపోయినా నోయల్ టాటా, చంద్ర మధ్య ఉన్న సంఘర్షణ గురించి అందరికీ తెలిసిందే. రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయల్ టాటా బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి రెండు విడతలుగా టాటా సన్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రకు మరో దఫా బాధ్యతలు ఇవ్వడానికి కొన్ని హామీలను నోయల్ కోరారు. గ్రూప్‌నకు సంబంధించి అయిదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికపై ఆయన స్పష్టత కోరారు. కొత్త వ్యాపారాల్లో నష్టాలు తగ్గించాలని కోరారు. ‘టాటా సన్స్’ను లిస్ట్ చేయకుండా, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ను సంస్థ నుంచి బయటకు పంపే మార్గాన్ని వెతకమన్నారని ఈ అంశాలతో సంబంధమున్న వర్గాలు చెబుతున్నాయి. టాటా సన్స్ లిస్టింగ్ ఎప్పటికీ జరగకుండా చూసేందుకు చంద్ర హామీనివ్వలేదని తెలుస్తోంది. టాటా సన్స్ లిస్టింగ్‌పై బోర్డులోనూ విభేదాలున్నాయి. మే నెలలో జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలూ చంద్రను కలతచెందేలా చేశాయని ఆ వర్గాలు అంటున్నాయి. ఎయిరిండియా, బిగ్‌బాస్కెట్ తదితర వ్యాపారాలన్నిటిపైనా నోయల్ దృష్టి సారిస్తారని, గ్రూప్ కంపెనీల సమీక్షలకు చంద్ర నాయకత్వం వహిస్తారని అందులో తేల్చారట.
మనదేశంలో అతిపెద్ద వ్యాపార దిగ్గజమైన టాటా గ్రూప్‌లో మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణానంతరం అధికార సంఘర్షణ మొదలైంది. రతన్‌తో అనుబంధమున్న సీనియర్లందరూ ఒక్కొక్కరిగా గ్రూప్‌ను వీడుతున్నారు. 2025లో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, టాటా ట్రస్ట్స్ నామినీ విజయ్, బోర్డు నుంచి వైదొలిగారు. సర్ రతన్ టాటా ట్రస్ట్‌లో ట్రస్టీ బాధ్యతల నుంచీ విజయ్ నిష్క్రమించనున్నారు. ఈ ట్రస్టులో కీలక ట్రస్టీ అయిన వేణు శ్రీనివాసన్ సైతం బయటకొచ్చారు. రతన్‌కు అత్యంత ఆప్తుడైన మెహ్లీ మిస్త్రీ కూడా ట్రస్టులకు రాజీనామా చేశారు. ఇక స్వతంత్ర డైరెక్టయిన అజయ్ పిరమాల్, రాల్ఫ్ స్పెత్ పదవీ విరమణ చేశారు.
టాటా ట్రస్ట్స్ల మధ్య విభేదాలు 2025లో తీవ్రతరమయ్యాయి. నోయల్‌తో ఒక వర్గం, మిస్త్రీకి మద్దతుగా మరో వర్గం తయారయ్యాయి. టాటా ట్రస్ట్‌లలో పాలనాపరమైన ఆందోళనల మధ్య గతేడాది అక్టోబరులో నోయల్ టాటా, చంద్రశేఖరన్, శ్రీనివాసన్ తదితరులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన విషయం తెలిసిందే.
చంద్రశేఖరన్ నిష్క్రమణ ప్రకటనతో టాటా గ్రూప్‌నకు చెందిన పలు షేర్లు నష్టాల పాలయ్యాయి. టీసీఎస్ 3.71% కుంగింది. టాటా కన్జూమర్, టాటా ఎలెక్సీ, టీఎమ్‌పీవీ, టాటా స్టీల్ 1.57-2.44% నష్టపోయాయి. ర్యాలీస్ ఇండియా, ట్రెంట్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కమ్యూనికేషన్స్, టైటన్ 0.18-0.95% మేర తగ్గాయి. మొత్తం గ్రూప్‌లో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.45,615.67 కోట్లు తగ్గింది. ఇందులో టీసీఎస్ వాటానే రూ.32,743.679 కోట్లుగా ఉంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో ఒక ఇంటర్న్‌గా 1987లో చంద్రశేఖరన్ అడుగుపెట్టారు. క్రమంగా పలు బాధ్యతలు నిర్వహిస్తూ, 2009 నాటికి టీసీఎస్ సీఈఓ స్థాయికి ఎదిగారు. 2017లో ఏకంగా టాటా సన్స్ ఛైర్మన్ పగ్గాలు చేపట్టారు. టాటా సన్స్‌కు ఒక పార్శీయేతర వ్యక్తి ఛైర్మన్ కావడం అదే తొలిసారి. సైరస్ మిస్త్రీ కారణంగా 2016 నాటి బోర్డు రూము సంఘర్షణల అనంతరం గ్రూప్‌లో స్థిరత్వాన్ని తీసుకొచ్చారు.
చంద్ర హయాంలో విమానయానం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, బ్యాటరీలు, డిజిటల్ కామర్స్‌లో టాటా గ్రూప్ విస్తరించింది. టెక్నాలజీ, వాహన, ఉక్కు వ్యాపారాలను బలోపేతం చేసుకుంది. కేంద్రం నుంచి 2022లో ఎయిరిండియాను టాటాలు కొనుగోలు చేశారు. ఇ-కామర్స్ సంస్థలైన బిగ్‌బాస్కెట్, 1ఎమ్జీల్లో మెజారిటీ వాటాలను టాటా డిజిటల్ కొనుగోలు చేసింది. గ్రూప్‌నకు చెందిన సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ లక్ష్యాలను టాటా ఎలక్ట్రానిక్స్ భుజాన వేసుకుంది. టాటా కాఫీని టాటా కన్జూమర్‌లో; టిన్‌ప్లేట్ కంపెనీ, టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్‌ను టాటా స్టీల్‌లో విలీనం చేయడానికి చంద్ర కృషి చేశారు. టాటా టెక్నాలజీస్, టాటా క్యాపిటల్ లిస్టింగ్ చేశారు.
ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్‌లో ప్రమాదానికి లోనయి వందలమంది మరణించడం, చంద్ర హయాంలో అతిపెద్ద సంక్షోభంగా చెప్పొచ్చు. ఏఐ (కృత్రిమమేధ) విషయంలో గ్రూప్‌లోని టెక్నాలజీ వ్యాపారాలపైనా ఒత్తిడి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలూ తగ్గాయి. సైబర్ దాడీ జరిగింది. ఎయిరిండియాలో నష్టాలూ పెరుగుతున్నాయి. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు.
టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారన్న దానిపై ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా పేరు చర్చల్లోకి రావొచ్చు. అయితే పాలనపరమైన చిక్కు ఒకటి ఉంది. సవరించిన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ టాటా సన్స్ ప్రకారం, టాటా ట్రస్ట్స్‌కు, టాటా సన్స్‌కు ఏకకాలంలో ఛైర్మన్‌గా నోయల్ టాటా వ్యవహరించలేరు. 2022లో ఆర్టికల్ 118ను ఆ మేరకు టాటా సన్స్ సవరించింది. దీని ప్రకారం, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ లేదా సర్ రతన్ టాటా ట్రస్ట్ లేదా రెండింటికీ ఛైర్మన్‌గా ఉన్నవారు టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా ఉండడానికి కుదరదు. అందువల్ల నోయల్ టాటా ఆ పదవిలో కూర్చునే అవకాశం ఉండదు. ఈ రెండు పదవులను నిర్వహించిన చివరి వ్యక్తి రతన్ టాటానే. అయితే టాటా సన్స్ నూతన ఛైర్మన్ ఎంపికలో నోయల్ కీలకపాత్ర పోషించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.