ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. మొన్నటికి కాక్రోచ్ జనత పార్టీ ధాటికి ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సొచ్చింది. దాని నుంచి తేరుకోకముందే.. బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతు అనుభవాన్ని చవి చూసింది. సాక్షాత్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖాళీ చేసిన ఈ కంచుకోటను నిలబెట్టుకోలేకపోయింది.2010 నుంచి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన ఈ నియోజకవర్గాన్ని బంగారం పళ్లెంలో పెట్టి మరీ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వాన్ని వహిస్తోన్న బీజేపీ. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మడమ తిప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కులం, విద్యార్థులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పునఃసమీక్షించుకుంటోండటం దీనికి నిదర్శనం.దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధానికి తీసుకొచ్చిన నూతన యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోనుంది కేంద్రం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సైతం తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారికంగా సమాచారం ఇచ్చారు.యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోవడం అనేది.. కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బే. ఈ నిర్ణయం వెనుక కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలపై అగ్రవర్ణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని బాంకీపూర్ ఉప ఎన్నిక రెఫరెండంగా భావించినట్టయింది. ఇక్కడ ఓటమిపాలు కావడం.. ప్రజల్లో, ప్రత్యేకించి.. అగ్రవర్ణ సామాజిక వర్గాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందనేది స్పష్టమైంది.దాదాపు మూడు దశాబ్దాలుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్‌కు ధారాదాత్తం చేసుకోవడం వెనుక యూజీసీ నిబంధనలపై వ్యక్తమైన అగ్రవర్ణాల అసంతృప్తే కారణమని బీజేపీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. ఈ కీలక నియోజకవర్గంలో దాదాపు 35 శాతం అగ్రవర్ణ ఓటర్లు ఉండటం, వారిలో ఉన్న అసంతృప్తి అంతా కూడా ఈ ఉప ఎన్నిక ఫలితాలపై నేరుగా పడిందని పార్టీ భావిస్తోంది.అసలు కథేంటీ?యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్.. ఈ ఏడాది జనవరి 13న ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ నిబంధనలను అధికారికంగా నోటిఫై చేసిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో మతం, జాతి, లింగం, పుట్టిన స్థలం, కులం లేదా వైకల్యం ఆధారంగా జరిగే వివక్షను పూర్తిగా రూపుమాపి సమానత్వాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.క్యాంపస్‌లలో వివక్ష ఎదుర్కొనే విద్యార్థుల కోసం ఈక్వల్ అపార్చునిటీ సెల్స్ తో పాటు నిబంధనలను అమలును ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ నిఘా టీమ్ ఈక్విటీ స్క్వాడ్స్ ఏర్పాటును ఈ నిబంధనలు తప్పనిసరి చేశాయి. నిజానికి.. ఈ కుల వివక్ష నిర్మూల నిబంధనలు గానీ, మార్గదర్శకాలు గానీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా చేసినవి కావు. కుల వివక్ష బారిన పడి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల, మహారాష్ట్ర జల్ గావ్ కు చెందిన డాక్టర్ పాయల్ తద్వి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగానే వాటిని రూపొందించింది కేంద్రం.యూజీసీ వివక్ష నిరోధక నిబంధనలపై వ్యతిరేకతఈ కొత్త నిబంధనల అమలుపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. జైపూర్‌లో కర్ణి సేన సవర్ణ న్యాయ్ పద్ యాత్ర పేరుతో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నిబంధనలను రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేసింది. అగ్రవర్ణ హక్కుల కోసం పోరాడే పలు ఇతర సంఘాలు సైతం వీరికి మద్దతుగా నిలిచాయి.మరోవైపు సామాజికంగా వెనుకబడిన వర్గాల సంఘాలు మాత్రం ఈ విద్యా నియమావళిని గట్టిగా సమర్థిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఇప్పటికీ అనేక రూపాల్లో వివక్షను ఎదుర్కొంటోన్నారని గుర్తు చేస్తున్నాయి. క్యాంపస్‌లలో వారి భద్రతను కాపాడి, వివక్షకు తావు లేకుండా ఉండేందుకు ఇలాంటి చట్టబద్ధమైన రక్షణలు అత్యంత ఆవశ్యకమని ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి.సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ మార్గదర్శకాల అమలుపై స్టే విధించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వీటిని పునఃసమీక్షించేందుకు సిద్ధం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో ఈ నిబంధనలు ఎలాంటి రూపం దాల్చనున్నాయోననేది చర్చనీయాంశమౌతోంది. అటు సామాజిక న్యాయాన్ని, ఇటు వివిధ వర్గాల ఆందోళనలను సమతుల్యం చేయడం ఇప్పుడు కేంద్రం ముందున్న సవాల్.