
దిల్లీ: ఇటీవలే అర్జున పురస్కారాలకు ఎంపికైన భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం మహిళల డబుల్స్ సెమీఫైనల్స్‌లో గాయత్రి జోడీ 21-18, 13-21, 8-21తో లియు షెంగ్షు, టాన్ నింగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్ పోరాడి గెలిచిన భారత ద్వయం తర్వాత రెండు గేమ్‌లను చేజార్చుకుంది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్ ఆరంభంలో భారత జోడీ 4-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత చైనా ద్వయం దూకుడుగా ఆడి 7-7తో స్కోరును సమం చేసింది. తర్వాత పోరు నువ్వానేనా అన్నట్లు సాగింది. ఈ క్రమంలో ట్రీసా, గాయత్రి 16-18తో వెనుకబడినా.. గొప్పగా పుంజుకుని గేమ్‌ను గెల్చుకున్నారు. రెండో గేమ్‌లో చైనా జోడీ దూకుడు ప్రదర్శించి 5-2తో నిలిచినా భారత జోడీ పుంజుకుని 11-10తో ఆధిక్యంలోని నిలిచింది. తర్వాత లియు షెంగ్షు, టాన్ నింగ్ దూకుడు పెంచి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హవా అంతా చైనా జోడీదే. భారత ద్వయం కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ట్రీసా, గాయత్రి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు