
ఇంటర్నెట్ డెస్క్: అధికార, విపక్షాల నిరసనలతో పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. దిల్లీలో నిరసనకారులపై పోలీసుల దాడి గురించి హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడాలని.. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు (Oppositions Protest) డిమాండ్ చేశాయి. మరోవైపు ఝార్ఖండ్‌లో విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడాలని భాజపా ఎంపీలు నినాదాలు (BJP Protest) చేశారు. దిల్లీ విషయంలో మీడియాలో చర్చలు జరిపిన రాహుల్ ఝార్ఖండ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇరువర్గాల పోటాపోటీ నిరసనలతో పార్లమెంట్ ఆవరణలో గందరగోళం నెలకొంది. మరోవైపు లోక్‌సభలో చర్చలు జరుగుతుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంతో స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థవంతమైన చర్చలు జరపాలని హితవు పలికారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సమావేశాలు తుదిదశకు చేరుకుంటుండటంతో.. అధికార విపక్షాల మధ్య రాజకీయ పంతం మరింత పెరిగింది. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యపై విపక్షాలు కోరినట్లుగా... హోంమంత్రి అమిత్‌షా సభలో సమాధానం ఇవ్వటానికి సిద్ధమని కేంద్రం సోమవారం ప్రకటించగా... ఊరికే ప్రసంగాలు కాదు... మేం అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మెలిక పెట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు