
ఇంటర్నెట్ డెస్క్: తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ మరోసారి భారత్‌ను కోరింది. బంగ్లా ప్రధాని తారిఖ్ రెహమాన్ (Tarique Rahmans) దిల్లీ పర్యటనపై అనిశ్చితి నెలకొన్న వేళ ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తింది. ప్రధాని పర్యటన ముందు అనుకూలమైన వాతావరణం కోరుకుంటున్నామని పేర్కొంది. పరోక్షంగా హసీనా అప్పగింత అంశాన్ని ముడిపెట్టింది. త్వరలో దిల్లీ వేదికగా బ్రిక్స్ సమావేశానికి రెహమాన్ హాజరవ్వటంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షాహిదుల్ కరీమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రధాని రెహమాన్ భారత్ పర్యటనపై గత కొన్ని వారాలుగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. షేక్ హసీనా బహిరంగ సమావేశం వల్ల కొంత అడ్డంకి ఏర్పడింది. షేక్ హసీనాతో పాటు ఇతర నేరస్థులను ఢాకాకు అప్పగించాలని భారత్‌ను కోరుతున్నాం. ఢాకా ప్రతిపాదనాలకు భారత్ సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. పర్యటనకు ముందు అనుకూల వాతావరణం నెలకొనాలని భావిస్తున్నాం. భారత్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అని కరీమ్ పేర్కొన్నారు. ఇదే విషయంపై ఇటీవల భారత్ హై కమిషనర్‌ను రహమాన్ కలిశారు. దిల్లీ పర్యటనకు ఆయన రావడంపై స్పష్టత ఇవ్వలేదని సమాచారం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు