
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు బాలనటులుగా తమ కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది మాత్రం క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. అలాంటి వారిలో నటుడు బాలాదిత్య కూడా ఒకరు. బాలనటుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలాదిత్య 1991లో, తన ఆరవ ఏట ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ సినిమాతో బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు తొలి క్లాప్ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.



