
శ్రావణ మాసం ప్రారంభంతోనే మొదలైన పెళ్లి సందడి రేపటి నుంచి సెప్టెంబర్ 5 వరకు.. ఈ నెల తప్పితే అక్టోబర్ 29 తరువాతే.. హైదరాబాద్ సిటీ: శ్రావణ మాసం వచ్చేసింది. దానితో పాటు శుభ గడియలూ ప్రారంభమయ్యాయి. పూజలు, వ్రతాలు మాత్రమే కాదు... రెండు మనసులను ముడి వేసే పెళ్లి సందడి కూడా మొదలైపోతుంది. ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, డెకరేషన్, ఫొటోగ్రఫీ, మేకప్, బంగారం, వస్త్ర దుకాణాలకు గిరాకీ పెరగనుంది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 5 వరకు వివాహాలకు అనుకూలమైన రోజులు ఉన్నప్పటికీ, అన్ని రకాలుగా కలిసొచ్చే ముహూర్తాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే ముందస్తు బుకింగ్స్‌తో నిండిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికితోడు ఈ శ్రావణ మాసం దాటితే అక్టోబర్ 29 వరకు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో తమ పిల్లల పెళ్లిళ్లను ఈ స్వల్ప వ్యవధిలోనే జరిపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఫంక్షన్ హాళ్లకు పెరిగిన డిమాండ్ శ్రావణ మాసంలో పెళ్లి పనులు మొదలు పెడదామనుకున్న వారికి ఫంక్షన్ హాళ్లు దొరకడం లేదు. ముఖ్యంగా శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ఖాళీలు ఉండడం లేదు. మెహందీ, సంగీత్, హల్దీ, రిసెప్షన్ వంటి కార్యక్రమాలతో పెళ్లిళ్లు రెండు, మూడు రోజుల వేడుకగా మారడంతో ఈ సమస్య ఏర్పడుతోందని చంపాపేటలోని ఒక ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు గోవింద్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల అద్దెలు కూడా పెరిగాయి. ముందస్తు ఏర్పాట్లు శ్రావణమాసంలో పెళ్లి చేయాలనుకునే కుటుంబాలకు ఈ సారి సమయం పెద్దగా లేదు. ఆగస్టు 15, 16, 21, 22, 23, 26, 27, 28, 30తోపాటు సెప్టెంబర్ 3,4,5 తేదీల్లోనే మంచి, మధ్యస్థ ముహూర్తాలు ఉన్నాయి. వారాంతాలు, సెలవు రోజులు చూసుకుంటే అనువైన తేదీలు మరింత తగ్గాయి. గతంలో లగ్నం, తిథి, నక్షత్రం, జాతకాలు తదితర అంశాలను పరిశీలించి ముహూర్తం