వేదికలు, యువజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సినీ వేడుకలు, సంగీత ప్రదర్శనల సమ్మేళనంగా మహాసభలు సాగాయి. భారత్, అమెరికాకు చెందిన కళాకారులు శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు, సంగీతంతో వేదికను అలంకరించారు. యువత కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాలు వారికి నాయకత్వ నైపుణ్యాలు, వృత్తి అవకాశాలపై అవగాహన కల్పించాయి. యువజన సదస్సు ఈ మహాసభల్లో కీలక ఆకర్షణగా నిలిచింది. రెండో, మూడో తరానికి చెందిన తెలుగు యువత తమ మూలాలను గుర్తించడంతో పాటు నాయకత్వం, కమ్యూనికేషన్, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేలా ప్రత్యేక సెషన్లు నిర్వహించారు.
అమెరికా సాయుధ దళాల్లో సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను సత్కరించడం భావోద్వేగభరిత ఘట్టంగా నిలిచింది. వారి సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని నిర్వాహకులు పేర్కొన్నారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ.. తెలుగు, భారతీయ అమెరికన్లు సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపార రంగాల్లో అమెరికా అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. వృత్తిపరమైన విజయాలను సేవా దృక్పథం, కుటుంబ విలువలు, పౌర బాధ్యతతో సమన్వయం చేసే సమాజాల ప్రాముఖ్యతను వివరించారు. సంస్కృతి, విజయాలు, సేవలను వేడుకగా జరుపుకునేందుకు వేలాదిమందిని ఒకచోట చేర్చిన ఆటాను ప్రశంసించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ మాట్లాడుతూ.. యువతకు విద్య, నాయకత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని సూచించారు. యువత అమెరికన్ సమాజంలో తమదైన గుర్తింపును నిర్మించుకొని అవకాశాలను అందిపుచ్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. భారత్ నుంచి అమెరికాలో ప్రజాప్రతినిధిగా ఎదిగిన తన ప్రయాణాన్ని ప్రతిబింబించే స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా హష్మీ మాట్లాడుతూ.. ఆటా మహాసభలకు రావడం ‘ఇంటికి తిరిగి వచ్చినట్లుగా’, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లుగా అనిపించిందన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన హష్మీ.. తన బాల్యం, పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాద్ బిర్యానీ, సికింద్రాబాద్–వరంగల్ రైలు ప్రయాణాల జ్ఞాపకాలను పంచుకున్నారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్‌తో తన ప్రత్యేక అనుబంధాన్ని హష్మీ ప్రస్తావించారు. ఇద్దరూ ఒకే సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించి, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు లెఫ్టినెంట్ గవర్నర్లుగా సేవలందించడం అరుదైన మైలురాయన్నారు. చిన్న వ్యాపారాలు, పెద్ద సంస్థలు, విద్య, వైద్యం, సాంకేతికత, ప్రజాసేవ తదితర రంగాల్లో తెలుగు, భారతీయ అమెరికన్ల సేవలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైవిధ్యభరిత నేపథ్యాలే అమెరికన్ సమాజాల బలమని చెప్పారు. వర్జీనియా 43వ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన హష్మీ.. అమెరికాలో రాష్ట్రవ్యాప్త పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా నిలిచారు. వర్జీనియాలో రాష్ట్రవ్యాప్త పదవికి ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్ కూడా ఆమెనే కావడం విశేషం.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యతలు, పెట్టుబడి అవకాశాలపై ప్రవాస తెలుగు సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో తెలుగు ప్రజల వృత్తి, ఆర్థిక విజయాలను ప్రశంసిస్తూ, సాంస్కృతిక మూలాలతో వారు కొనసాగిస్తున్న అనుబంధాన్ని అభినందించారు. తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లోని తెలుగు పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశాలను వివరించారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులు, సాంకేతికత, తెలంగాణతో ప్రపంచ తెలుగు సమాజానికి పరస్పర ప్రయోజనం కలిగించే భాగస్వామ్యాల ప్రాధాన్యతను చెప్పారు. విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, రంగ నిపుణులు తమ విజ్ఞానం, వృత్తి సంబంధాలు, అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
తెలుగు సినీ, సంగీత రంగానికి చెందిన ప్రముఖులు మహాసభలకు హాజరై ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, విలక్షణ నటుడు అడివి శేష్, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్ తదితరులు హాజయ్యారు. హీరో నవీన్ పోలిశెట్టి ప్రేక్షకులతో ముచ్చటిస్తూ.. మహాసభలను ఉర్రూతలూగించారు. పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా తమ గ్లామర్‌ను జోడించారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తన ప్రత్యేక సంగీత శైలితో సభికులను అలరించారు. గాయని సునీతతో పాటు పలువురు గాయకులు, వాద్యకారులు సంగీత వాతావరణాన్ని మరింత రసవత్తరంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక వైభవం, సామాజిక సేవ, వ్యాపార అవకాశాలు, యువజన భాగస్వామ్యంతో ఈసారి జరిగిన ATA మహాసభలు సంస్థ చరిత్రలో మైలురాయిగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజ ఐక్యతను మరోసారి చాటిచెప్పాయి.