
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫైర్‌బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు ఉన్నప్పటికీ, మంత్రి పదవి చేపట్టిన ప్రతీసారి సొంత పార్టీ ముఖ్యమంత్రులతోనే తలపడటం ఆమె రాజకీయ ప్రస్థానంలో ఒక ఆనవాయితీలా కనిపిస్తోంది. సురేఖకు మంత్రి పదవి కలిసిరావడం లేదా లేక ఆమె చేసుకుంటున్న వివాదాలే ఆమె రాజకీయ భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారుతున్నాయా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. కొండా సురేఖ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, 2009 నాటి పరిణామాలు ప్రత్యేకంగా గుర్తుకొస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో 2009 మే 25న కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అదే ఏడాది వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్‌తో, కొత్తగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య నాయకత్వాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సరిగ్గా 100 రోజులకే (29 సెప్టెంబర్ 2009) ఆమె తన పదవికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన రాజీనామా లేఖను నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు సమర్పించి పెను సంచలనం సృష్టించారు. నాటి నిర్ణయం రాజకీయంగా ఆమె సొంత తప్పిదమేనని, తొందరపాటు చర్యేనని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్సార్సీపీ, అనంతరం బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచినా అక్కడ ఇమడలేకపోయారు. తిరిగి సొంత గూడైన కాంగ్రెస్‌లోకి రావడంతో, పార్టీ ఆమె సీనియారిటీని గుర్తించి రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవిని అప్పగించింది. కానీ, అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే మళ్లీ పాత తరహా ఘర్షణాత్మక వైఖరే తెరపైకి వచ్చింది. సొంత జిల్లాలో సీఎం అధికారిక పర్యటనలు, సభలు జరుగుతున్నా మంత్రిగా హాజరుకాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాకుండా, ఆమె కుమార్తె కొండా సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే గురిపెట్టి బహిరంగంగా