© 2026 nimisham.in
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కింద నైపుణ్య శిక్షణ అందించనుంది. ఇజ్రాయెల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కోచోట 50 మంది చొప్పున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడత 100 రోజుల పాటు శిక్షణ అందించనుండగా.. త్వరలోనే ట్రైనింగ్ ప్రారంభం కానుంది.ఇజ్రాయెల్లో హోమ్ బేస్డ్ కేర్గివింగ్కు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ ఉద్యోగాల కోసం ఏఎన్ఎం/జీఎన్ఎం,బీఎస్సీ నర్సింగ్ చేసిన మహిళలు మాత్రమే అర్హులు. ఇజ్రాయెల్లో ఉద్యోగాలకు సంబంధించి అవసరమైన శిక్షణ అందిస్తారు. వీరికి కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉన్న పాస్పోర్ట్ ఉండాలి. అంతేకాదు గతంలో ఇజ్రాయెల్లో పనిచేసి ఉండకూడదు. అభ్యర్థుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు ప్రస్తుతం ఇజ్రాయెల్లో నివాసం, ఉద్యోగం చేస్తుండకూడదు.రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు శిక్షణ తీసుకునేలా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో ఈ శిక్షణా కేంద్రాలు ప్లాన్ చేశారు. శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కడప, అనంతపురంలలో ఇతర వృత్తులకు సంబంధించి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణా కేంద్రాల కోసం ఎంపిక చేశారు. ఈ శిక్షణా కేంద్రాల్లో ఎస్సీ మహిళలతో పాటు పురుషులకు అవసరమైన శిక్షణ అందిస్తారు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు జర్మనీలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ యువత కోసం ఇతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు మూడు నెలల పాటూ శిక్షణ ఇస్తారు. అనంతరం వారికి సర్టిఫికెట్ కూడా అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అంతేకాదు వారు
వ్యాపారాలు నిర్వహించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తారు.