
వైకాపా ప్రభుత్వంలో తెచ్చిన నిబంధన యథాతథంగా అమలు ఇబ్బంది పడుతున్న కార్మికులు ఈనాడు, అమరావతి: చేనేత కార్మికులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద పింఛన్లు పొందేందుకు జీఎస్టీ చెల్లింపు బిల్లు ఉండాలనే నిబంధన ఇబ్బందిగా మారింది. పింఛన్లను వీలైనంతగా తగ్గించాలన్న ఆలోచనతో వైకాపా ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఈ నిబంధనను యథాతథంగా ఇప్పుడు చేనేత, జౌళిశాఖ అధికారులు అమలు చేయడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిబంధనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వారు చేనేత, జౌళిశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇవీ నిబంధనలు..: చేనేత సహకార సంఘాల్లో ఉండే కార్మికులు, మాస్టర్‌ వీవర్స్‌ వద్ద పనిచేసేవారు, సొంత మగ్గం నేసేవారంటూ మూడు విభాగాలుగా విభజించి అర్హత పరిశీలనకు పలు నిబంధనలు తెచ్చారు. ఇవన్నీ వైకాపా ప్రభుత్వంలో తెచ్చినవే. సొం త మగ్గంపై నేసే వారిలో చాలామంది ఎలాంటి బిల్లులూ లేకుండానే ముడి పట్టును కొని నేతకు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారి వద్ద జీఎస్టీ బిల్లులు ఉండవు. ఉరవకొండలో సొంత మగ్గం కలిగి ఉన్న వందల మంది కార్మికులు మధ్యవర్తుల ద్వారా కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి ముడి పట్టు తెప్పించుకుంటున్నారు. పెట్టుబడి భారం మోయలేక ఇలా చేస్తున్నారు. వీరి వద్ద సరకు కొనుగోళ్లకు సంబంధించి జీఎస్టీ బిల్లులు లేవు. ఇలాంటి పరిస్థితే ధర్మవరం, మదనపల్లె, మంగళగిరి, ఉప్పాడ, కోడుమూరు, చీరాల, వెంకటగిరి, జమ్మలమడుగు, మాధవరం తదితర ప్రాంతాల్లో ఉంది. దీంతో చేనేత పింఛన్లకు అర్హత ఉన్న వారిలో దాదాపుగా 30 శాతం మందికి పింఛన్లు అందని పరిస్థితి ఉందని చేనేత సంఘాల నేతలు పేర్కొంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





