
American Airlines : అమెరికన్ ఎయిర్లైన్స్ (American Airlines) కు చెందిన విమానంలో ఓ మహిళ అభ్యంతరకరంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. బాల్టిమోర్ నుంచి మియామికి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 160 మంది ప్రయాణికులతో విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆ మహిళ ఊహించని విధంగా తన దుస్తులను తొలగించుకుంది. దిగంబరంగా మారి, బిగ్గరగా కేకలు వేస్తూ అటూఇటూ తిరగడం ప్రారంభించింది. దాంతో తోటి ప్రయాణికులు దిగ్భ్రాంతికి లోనవ్వడమే కాకుండా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని, బలవంతంగా దుస్తులు ధరింపజేసి ఒకచోట కూర్చోబెట్టారు. ఈ విషయాన్ని వారు పైలట్ల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే విమానాన్ని దారి మళ్లించకుండా గమ్యస్థానమైన మియామికే తీసుకెళ్లాలని సిబ్బంది నిర్ణయించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ మహిళను మియామి పోలీసులకు అప్పగించారు. ఆమె ఎందుకు అలా అసాధారణంగా ప్రవర్తించిందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 11న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.