© 2026 nimisham.in
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) గట్టి షాక్ ఇచ్చింది. ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో సాధారణ స్వీట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్‌కు సీసీపీఏ రూ.1 లక్ష జరిమానా విధించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే సాధారణ స్వీట్లను రామ మందిర ప్రసాదంగా ప్రచారం చేసినట్లు సీసీపీఏ నిర్ధారించింది. సీసీపీఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 15 రోజుల్లోగా రూ.1 లక్ష జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.‘బిహార్ బ్రదర్స్’ బ్రాండ్ పేరుతో చందు ట్రేడింగ్ అనే కంపెనీ విక్రయించిన స్వీట్లను అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’గా చూపించిన వ్యవహారంపై సీసీపీఏ ఈ చర్య తీసుకున్నారు. అమెజాన్‌లో విక్రయానికి ఉంచిన ఉత్పత్తుల్లో నెయ్యి లడ్డూలు, ఖోయా లడ్డూలు, బూందీ లడ్డూలు, ఆవు పాల పేడా వంటి స్వీట్లు ఉన్నాయి. వీటిని ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో ప్రచారం చేయడంతో పాటు.. ‘లార్డ్ రామ్ ఆశీర్వాదాలు’ వంటి పదాలను కూడా ఉత్పత్తుల వివరణలో ఉపయోగించినట్లు సీసీపీఏ తెలిపింది.అయితే.. ఈ స్వీట్లను అయోధ్య రామ మందిర ప్రసాదం గా విక్రయించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఎలాంటి ధ్రువీకరించిన అనుమతి గానీ, ఆమోదం గానీ తీసుకోలేదని సీసీపీఏ విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) 2024 జనవరిలో సీసీపీఏకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీసీపీఏ అధికారులు.. ‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అనే పేరు చూసిన భక్తులు, కస్టమర్లు ఆ ఉత్పత్తులను నిజమైన ఆలయ ప్రసాదంగా భావించే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఆలయ పేరు, ప్రసాదం పేరును అధికారిక అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం కస్టమర్లను తప్పుదోవ పట్టించడమే కాకుండా.. కోట్లాది మంది
భక్తుల మతపరమైన భావాలను దెబ్బతీసే అవకాశం ఉందని సీసీపీఏ అభిప్రాయపడింది. ఈ కేసులో అమెజాన్ కేవలం మధ్యవర్తి మాత్రమేనని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోలేదని సీసీపీఏ స్పష్టం చేసింది. ప్లాట్‌ఫామ్‌పై ఉత్పత్తులు ఏ పేరుతో, ఏ విధంగా ప్రచారం అవుతున్నాయనే అంశంలో ఈ-కామర్స్ సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆదేశాల ద్వారా స్పష్టమవుతోంది.అదేవిధంగా అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌పై విక్రేతలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని.. సంస్థ గ్రీవెన్స్ ఆఫీసర్ వివరాలను వినియోగదారులకు స్పష్టంగా అందుబాటులో ఉంచాలని సీసీపీఏ సూచించింది. అయితే ఇది కేవలం అయోధ్య రామ మందిరంతోనే ఈ ఆదేశాలు ఆగిపోలేదు. దేశంలోని 10 ప్రముఖ మత సంస్థలు, ఆలయాల పేర్లను ఉపయోగిస్తూ ‘ప్రసాద్’, ‘మహాప్రసాద్’, ‘భోగ్’ వంటి పదాలతో ఉత్పత్తులను విక్రయించకుండా అమెజాన్ చర్యలు తీసుకోవాలని సీసీపీఏ ఆదేశించింది.ఈ 10 ఆలయాల్లో అయోధ్య రామ జన్మభూమితోపాటు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), మాతా వైష్ణోదేవి, జగన్నాథ ఆలయం వంటి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆయా ఆలయాలు, సంస్థల నుంచి ధ్రువీకరించిన అనుమతి లేకుండా వాటి పేర్లను ఉపయోగించి సాధారణ ఉత్పత్తులను అసలైన ప్రసాదంగా మార్కెట్ చేయకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.