
అక్రమార్కులకు చిక్కి నిరుద్యోగుల విలవిల ఈనాడు, అమరావతి రైల్వే శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువు దోపిడీ చేస్తున్నారు. డీఆర్ఎం కార్యాలయం కేంద్రంగా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్లు గతంలో సీబీఐ విచారణలో బయటపడింది. ఫిర్యాదులపై రైల్వే విజిలెన్స్ అధికారులు తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. కొంతకాలంగా ఉద్యోగాల పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు నమోదు కాకపోవడం గమనార్హం. గత రెండేళ్లుగా విజయవాడ డివిజన్లో ఉద్యోగాల పేరుతో బాధితుల నుంచి అక్షరాలా రూ.10కోట్లకు పైగా దళారులు వసూలు చేశారు. ఆగిరిపల్లికి చెందిన శ్రీనివాస్ అనే ఎంబీఏ విద్యార్థికి విజయవాడలో పని చేసే ఓ ఉద్యోగి తన స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యాడు. గతిశక్తి అనే రైల్వే విభాగంలో ఉద్యోగం ఉందని చెప్పడంతో ఆశపడ్డారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయించి రూ.7లక్షలు వసూలు చేశాడు. ఓ అధికారి సిఫార్సుతో ఈ తతంగమంతా జరిగింది. బాధితుడు తండ్రి తనకున్న కొద్దిపాటి పొలం అమ్మి మరీ దళారీకి డబ్బులు ఇచ్చారు. తీరా చేరిన తరువాత కాంట్రాక్ట్ ఉద్యోగమని తెలియడంతో సీబీఐకి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని అన్ని రైల్వే కార్యాలయాల్లో విజిలెన్స్ విభాగం ఫోన్ నంబర్లు, చిరునామాతో ఏర్పాటు చేసిన బోర్డులు అలంకార ప్రాయంగా మిగులుతున్నాయి. రైల్వే శాఖ నుంచే కొందరు డిప్యుటేషన్‌పై విజిలెన్స్ విభాగానికి వెళ్తుంటారు. అవినీతిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి సమాచారాన్ని ముందుగానే లీక్ చేసి కేసులను నీరుగారుస్తున్నారు. విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన నాగపద్మ బీటెక్ చదివారు. కొలువు వేటలో ఉండగా డీఆర్ఎం కార్యాలయంలో ఓ అధికారి వద్ద పని చేసే ఉద్యోగి రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5లక్షలు వసూలు చేశాడు. శాశ్వత ఉద్యోగమని చెప్పి ఒప్పంద ఉద్యోగం ఇప్పించాడు. చివరకు మోసపోయానని గ్రహించి సీబీఐని ఆశ్రయించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని