
తెనాలి టౌన్: బెట్టింగ్‌లకు అలవాటుపడి బంధువుల ఇంట్లో చోరీ చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు తెనాలి రెండో పట్టణ సీఐ రవీంద్రబాబు, ఎస్సై సురేశ్‌ వివరాలు వెల్లడించారు. తాడికొండ మండలం దామర్లపల్లి గ్రామానికి చెందిన 25 ఏళ్ల భరత్ బీటెక్ పూర్తి చేశాడు. తండ్రి చనిపోగా, తల్లి కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఉద్యోగ ప్రయత్నాల కోసం కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉన్న భరత్.. ఇటీవల తెనాలిలో పని ఉందంటూ పట్టణంలోని ఐతానగర్‌లో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వచ్చాడు. ఉద్యోగాలు చూసుకుంటున్నానంటూ సుమారు నెల రోజులు వారి ఇంటిలోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు వస్తువులు, వాహనం తీసుకుని వెళ్లిపోయాడు. బంధువులు అతనితో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడి తమ వస్తువులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. వచ్చి ఇస్తానని కాలయాపన చేసిన భరత్‌ అనంతరం ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు భరత్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 78 గ్రాముల బంగారపు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.