
చోరీ కేసులో యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్, చిత్రంలో ఏసీపీ దామోదర్, సీఐ చంద్రశేఖర్‌ విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: అతడు బీటెక్‌ చదివి ఉద్యోగం దొరక్క ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా చేరాడు. ఆ సంపాదన చాలకపోవడంతో దొంగగా మారాడు. పోలీసులకు చిక్కకూడదని బైక్‌ నంబర్‌ ప్లేట్‌ తీసేసి చోరీకి పాల్పడి పరారయ్యాడు. కానీ మాచవరం పోలీసులు సీసీ ఫుటేజీ, ద్విచక్రవాహన కంపెనీ ఇచ్చిన వివరాల సాయంతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఆదివారం డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌ సీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. వెటర్నరీకాలనీకి చెందిన బూసం నాగసురేఖ ఈ నెల 4న కుటుంబ సభ్యులతో కలిసి కుమార్తె వైద్య చికిత్స నిమిత్తం చెన్నై వెళ్లి 6న తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి ఇంటిలోని బంగారం, వెండి వస్తువులు గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకుపోయారు.దీనిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆరు ప్రత్యేక బృందాలు.. నిందితుడి కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నేరం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ద్విచక్రవాహనంపై ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. బండికి నంబరు ప్లేట్‌ లేకపోవటంతో సదరు వాహన కంపెనీ నుంచి వివరాలు సేకరించారు. పెనమలూరు ప్రాంతంలో నిఘా ఉంచి ఎట్టకేలకు నిందితుడిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. అతడు పెనమలూరుకు చెందిన మరీదు వినోద్‌ కుమార్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బండి వాయిదాలు చెల్లించేందుకు.. బి.టెక్‌. చదివిన వినోద్‌కుమార్‌ ఉద్యోగం లేకపోవడంతో పార్ట్‌టైంగా ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. తన ద్విచక్రవాహనం కిస్తీలు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెటర్నరీకాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించాడు. దాని తాళాలు పగలకొట్టి రూ.40లక్షల విలువైన 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 230 గ్రాముల వెండి వస్తువులు చోరీ చేశాడు. నిందితుడిని పట్టుకున్న ఏసీపీ దామోదర్, సీఐ చంద్రశేఖర్, ఎస్సై ఎ.వి.శ్రీనివాస్, హెడ్‌ కానిస్టేబుళ్లు రమేష్, అన్నారావు, సుభాష్‌కుమార్, కానిస్టేబుళ్లు మల్లేశ్వరరావు, ప్రసాద్, మణికంఠలను డీసీపీ అభినందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.