
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో విషాదాంతం చోటుచేసుకుంది. గోదావరి నదిలో గల్లంతైన ఆయన భార్య మీనా (55) మృతదేహం శనివారం లభ్యమైంది. ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలకు దీంతో ముగింపు పలికినట్లయింది.వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఏఈ నూకరాజు తన కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో మనవడు కార్తికేయ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. నదిలో గల్లంతైన మిగతా ముగ్గురి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.ఈ క్రమంలో ఈ నెల 17న నూకరాజు, 20న ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలను అధికారులు వెలికితీశారు. తాజాగా శనివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన, ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద మీనా మృతదేహాన్ని గాలింపు బృందాలు గుర్తించాయి. మీనా మృతదేహం కూడా లభ్యం కావడంతో నదిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్లయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా జలసమాధి కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
.