Gold Loan Business : దిగ్గజ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ABCL) ఆగస్ట్ 20న కీలక ప్రకటన చేసింది. గోల్డ్ లోన్ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమ సురక్షిత రుణాల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంలో భాగంగా గోల్డ్ లోన్ బిజినెస్‌ను వ్యూహాత్మక విస్తరణగా అభివర్ణించింది. దశల వారీగా పూర్తి స్థాయిలో గోల్డ్ లోన్ డెడికేటెడ్ బ్రాంచుల్ని తెరవనున్నట్లు స్పష్టం చేసింది. ముందుగా 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 200-300 వరకు బ్రాంచుల్ని ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఇక రాబోయే మూడేళ్లలో దీనిని 1000 బ్రాంచులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఈ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాల్ని వెల్లడించింది.తమ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) విభాగంలో ప్రవేశపెడుతున్న ఈ గోల్డ్ లోన్ బిజినెస్, ఇప్పటికే ఉన్న రిటైల్, MSME రుణ వ్యాపారానికి అదనపు బలాన్ని చేకూరుస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ వ్యక్తిగత రుణాలు, చిన్న వ్యాపారాలకు రుణాలు, పెద్ద కార్పొరేట్ సంస్థలకు మార్ట్గేజ్ లోన్లు ఆఫర్ చేస్తోంది. మరోవైపు హోం లోన్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ సేవల్లోనూ ఉంది. ఈ అనుభవమే వినియోగదారులకు మరింత పారదర్శకమైన, సౌకర్యవంతమైన, తాకట్టుతో కూడిన లోన్లు అందించడంలో దోహదపడుతుందని చెబుతోంది. సాధారణంగానే బంగారం తాకట్టు పెట్టుకొని ఇచ్చే లోన్లు కంపెనీలకు సురక్షితమైనవి, రిస్క్ తక్కువగా ఉంటుందన్న భావన ఉంది.Read Also: KKR దూకుడు.. మొన్న మెడికవర్స్ హాస్పిటల్స్ కొనుగోలు.. ఇప్పుడు రిలయన్స్ మద్దతున్న బుక్‌మైషోలో పెట్టుబడి!పెరిగిన ABCL షేరు ధరకంపెనీ తాజా ప్రకటనతో స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్న ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ షేర్లు దూసుకెళ్లాయి. కిందటి సెషన్లో రూ. 396 వద్ద ముగియగా, గురువారం రోజు దాదాపు 1 శాతం లాభంతో రూ. 399.80 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో మరింత దూసుకెళ్లి 2.50 శాతం వరకు లాభంతో రూ. 406.50 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 430.70 కాగా, కనిష్ఠ ధర రూ. 272.70 గా ఉంది. సంస్థ మార్కెట్ విలువ రూ. 1.06 లక్షల కోట్లుగా ఉంది. గత కొంత కాలంగా ఈ స్టాక్ భారీగా పుంజుకుంటోంది. ఏడాదిలో 42 శాతం పెరగడం విశేషం.భారతదేశంలో ప్రస్తుతం బంగారం రుణాల విభాగం బలమైన వృద్ధిని నమోదు చేస్తోందని, ఈ విభాగంలోకి మా ఆదిత్య బిర్లా క్యాపిటల్ ప్రవేశించడం భద్రతతో కూడిన రుణాల విస్తరణ వృద్ధికి దోహదపడుతుందని సంస్థ NBFC విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాకేష్ సింగ్ అన్నారు. పునాది స్థాయి నుంచి గోల్డ్ లోన్ కార్యకలాపాల్ని అత్యుత్తమంగా నిర్వహిస్తూ, తాము వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విధానంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.గోల్డ్ లోన్ వ్యాపారాల్లోకి టాటా, గోద్రెజ్ సంస్థలుఇటీవలి కాలంలో ఇలా పలు ఆర్థిక సేవల సంస్థలు ఈ గోల్డ్ లోన్ వ్యాపారాలపై దృష్టి పెడుతున్నాయి. టాటా క్యాపిటల్, గోద్రెజ్ క్యాపిటల్ ఇదివరకే వేర్వేరు గోల్డ్ లోన్ బిజినెస్‌లలో కొంత వాటా కొనుగోలు చేశాయి. టాటా క్యాపిటల్ యోగక్షేమం లోన్స్ లిమిటెడ్‌లో 88.6 శాతం వాటాను రూ. 360- 365 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో కనకదుర్గ ఫైనాన్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు గోద్రెజ్ క్యాపిటల్ ఆసక్తి చూపిస్తోంది. దీంతో ఇవన్నీ సంప్రదాయ గోల్డ్ లోన్ లెండర్స్ అయిన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.