© 2026 nimisham.in

singer murder case:54 మిలియన్ వ్యూస్‌తో సంచలనం సృష్టించిన ఓ పాటలో నటించిన యువ సింగర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ పాటలోని వివాదాస్పద అంశాలే హత్యకు కారణమయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యాన్వీ సింగర్ అంకిత్ బాల్యాన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కేవలం 28 ఏళ్ల వయసున్న అంకిత్ ఆగస్టు 26న ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంకిత్ నటించిన ఓ పాట ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘భరీ కోర్ట్ మే గోలి మారేంగే’ అనే పాట యూట్యూబ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ పాటకు ఏకంగా 54 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే పాటలోని కొన్ని పదాలు ఓ గ్యాంగ్‌కు ఆగ్రహం తెప్పించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, ఈ పాటలోని లిరిక్స్ తమ నాయకుడిని అవమానించేలా ఉన్నాయని గోగి గ్యాంగ్ సభ్యులు భావించినట్లు తెలుస్తోంది. 2021లో ఢిల్లీలోని రోహిణి కోర్టులో గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ప్రత్యర్థి గ్యాంగ్‌తో జరిగిన ఘర్షణలో జరిగింది. అంకిత్‌కు ప్రత్యర్థి గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని గోగి గ్యాంగ్ అనుమానించినట్లు సమాచారం. అంకిత్, ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారనే కారణంతో కూడా అనుమానం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే తాను పాటలో కేవలం నటించానని, పాటకు సంబంధించిన లిరిక్స్ లేదా మ్యూజిక్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అంకిత్ గతంలోనే స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ అతడిపై అనుమానాలు తగ్గలేదని పోలీసులు చెబుతున్నారు. గతంలో అంకిత్‌కు బెదిరింపులు కూడా వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దాడికి ముందు నిందితులు షామ్లీలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక పాటకు వచ్చిన భారీ
ప్రజాదరణే చివరకు ఓ యువ సింగర్ ప్రాణాలకు ముప్పుగా మారిందా అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. అయితే అంకిత్ హత్యకు అసలు కారణం ఏమిటనేది పోలీసుల పూర్తి దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతుంది.